న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. నూతనంగా గృహ రుణాలను తీసుకునేవారికి అధికం భారం మోపుతున్నది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రుణ గ్రహీతల జేబులకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. ప్రస్తుతం బ్యాంక్ గృహ రుణాలపై Interest rate7.50 శాతం నుంచి 8.70 శాతంగా ఆఫర్ చేస్తున్నది. గతంలో 7.50 శాతం నుంచి 8.45 శాతంగా ఉన్నది. తక్కువ సిబిల్ స్కోర్ ఉండేవారికి అధిక వడ్డీరేటుకు గృహ రుణాన్ని అందించనున్నది. ఈ వడ్డీరేట్ల పెంపు కొత్తగా తీసుకునే రుణాలకు మాత్రమే వర్తించనున్నదని, పాత వాటికి వర్తించదని బ్యాంక్ స్పష్టంచేసింది.
రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ ఎస్బీఐ మాత్రం వడ్డీరేట్లను పెంచడం విశేషం. రెపోరేటును 5.55 శాతంగా ఉంచిన విషయం తెలిసిందే. ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కలిగిన గృహ రుణంపై వడ్డీరేటు 7.75 శాతం నుంచి 8.95 శాతంగా వసూలు చేస్తున్నది. అలాగే టాప్-అప్ రుణాలపై బ్యాంక్ 8 శాతం నుంచి 10.75 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తున్నది.
ఉదాహరణకు 20 ఏండ్ల కాలపరిమితితో రూ.30 లక్షల గృహ రుణం తీసుకునేవారు 8.45 శాతం వార్షిక వడ్డీతో రూ.25,830 ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వడ్డీరేటు 8.70 శాతానికి పెంచడంతో ఈఎంఐ రూ.26,278కి చెల్లించాల్సివుంటుంది. అంటే నెలకు రూ.450 అదనంగా చెల్లించాల్సివుంటుంది. అంటే మొత్తం గృహ రుణంపై లక్ష రూపాయలు చెల్లించాలి. తక్కువ స్థాయి రుణాలతోపాటు రూ.50 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నవారికి కూడా భారం పడనున్నది.
మరో ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ కూడా గృహ రుణాలపై వడ్డీరేటును పది బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో గతంలో 7.35 శాతంగా ఉన్న గృహ రుణాలపై వడ్డీరేటు 7.45 శాతానికి ఎగబాకింది.
ఎస్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు గృహ రుణాలపై వడ్డీరేట్లను పెంచిన బ్యాంక్..మరోవైపు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నూతన రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. దీంతో ఒక్కరోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 7.95 శాతం నుంచి 7.90 శాతానికి దించింది. అలాగే నెల రోజుల రుణాలపై వడ్డీరేటు 8.8 శాతం నుంచి 8.75 శాతానికి దించిన బ్యాంక్..రెండేండ్లు, మూడేండ్ల రుణాలపై రేటును 8.85 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గించింది.
ఎస్బీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా ఎంసీఎల్ఆర్ని 35 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. దీంట్లో బీవోబీ ఎంసీఎల్ఆర్ని 35 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో నెల రోజుల రుణాలపై వడ్డీరేటు 8.3 శాతం నుంచి 7.95 శాతానికి దించిన బ్యాంక్..ఆరు నెలల రుణాలపై రేటు 8.75 శాతం నుంచి 8.65 శాతానికి, ఏడాది రుణాలపై రేటును 8.8 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 8.9 శాతంగా ఉన్నది. అలాగే ఒక్కరోజు, మూడు నెలల రుణాలపై రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణ రేటు 7.95 శాతానికి దిగొచ్చింది. దీంతోపాటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ఏడాది రుణాలపై వడ్డీరేటును 8.9 శాతానికి, ఆరు నెలల రుణాలపై రేటును 8.70 శాతానికి తగ్గించింది.
అలాగే నెల రుణాలపై ఎంసీఎల్ఆర్ని 8.3 శాతానికి, మూడు నెలల రుణాలపై రేటును 8.45 శాతానికి తగ్గించింది. మరో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో వడ్డీరేటు 8.90 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యకాలంలో రిజర్వుబ్యాంక్ రెపోరేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.