న్యూఢిల్లీ, జూలై 13: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు నయా మాడళ్లను అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. ప్రస్తుత నెలలో కూడా సరికొత్త మాడళ్లను ప్రవేశపెట్టబోతున్నాయి. వీటిలో టాటా, నిస్సాన్, హ్యుందాయ్, మెర్సిడెజ్, బీఎండబ్ల్యూ వంటి అరడజన్కు పైగా సంస్థలు తమ కొత్త మాడళ్లను విడుదల చేయబోతున్నాయి. దీంట్లో ప్రీమియం సెడాన్, లగ్జరీ హ్యాచ్‌బ్యాక్, పలు ఎస్‌యూవీలతోపాటు ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. వీటి వివరాలు..
టాటా మోటర్స్ ఈవీల పరిధిని మరింత విస్తరించడంలో భాగం మరో మాడల్‌ను విడుదల చేయడానికి రెడీ అయ్యింది. టాటా కర్వ్ ఈవీ పేరుతో విడుదల చేయనున్న ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనన్నది. ఈ కారు ధర రూ.20 లక్షల కంటే అధికంగా ఉంటుందని అంచనా. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఈ మాడల్నే ఈ నెల చివర్లో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నది.
దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి దశాబ్దకాలం పూర్తైన సందర్భంగా నిస్సాన్..ఫోర్త్ జనరేషన్ అవతార్ మాడల్‌ను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. ప్రీమియం టచ్ ఇన్సైడ్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, అడాస్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్‌గా ఈ మాడల్‌ను రూపొందించింది.
అల్కాజర్లో నయా మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది హ్యుందాయ్ మోటర్. ఈ నెల చివర్లో అందుబాటులోకి రానున్న ఈ కారు ధర రూ.17 లక్షల స్థాయిలో ఉంటుందని అంచనా. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో 10.25 ఇంచుల స్క్రీన్, డ్యూయల్-జోన్ ైక్లెమెట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జర్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఎనిమిదో జనరేషన్ 5 సిరీస్ మాడళ్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ మాడళ్లు అంతర్జాతీయ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. డ్యూయల్ డిజిటల్ స్క్రీన్, 4-జోన్ ైక్లెమెట్ కంట్రోల్, ఏడీఏఎస్, పెట్రోల్, డీజిల్‌తోపాటు హైబ్రిడ్ కూడా తయారు చేసింది.