Gold Price | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బంగారం ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆ మధ్య విరామం ఇచ్చిన రేట్లు.. తిరిగి పెరుగుతూపోతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పాయి. మునుపెన్నడూ లేనివిధంగా దేశీయ మార్కెట్లో తులం ధర ఏకంగా రూ.85వేల మార్కును దాటేసింది. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.85,300 పలికింది మరి. ఒక్కరోజే రూ.400 ఎగిసినట్టు అఖిల భారత సరఫా సంఘం తెలియజేసింది.
ఇదీ సంగతి..
పుత్తడి ధరలు ఈ స్థాయిలో రికార్డులకెక్కడం వెనుక.. నగల వ్యాపారులు, స్టాక్‌హోల్డర్ల నుంచి పెరిగిన డిమాండ్, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండే ప్రధాన కారణాలని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. ఇకపోతే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కదలాడుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడి వైపునకు మళ్లిస్తున్నారని, అందుకే ఈ ధరల పెరుగుదల అంటూ తాజా మార్కెట్ సరళిని నిపుణులు అంచనా వేస్తున్నారు. మున్ముందూ పరిస్థితులు ఇలాగే ఉంటాయన్న అంచనాల మధ్య ధరలు కొత్త రికార్డుల్నే సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం విలువ రూ.84,050గా ఉన్నది. గతంతో పోల్చితే రూ.440 తగ్గడం గమనార్హం. ఇక 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత లేదా ఆభరణాల బంగారం) 10 గ్రాముల రేటు రూ.77,050గా ఉన్నది. రూ.400 పడిపోయింది. ఇదిలావుంటే ఢిల్లీలో వెండి ధర కిలో రూ.300 పెరిగి రూ.96,000గా ఉన్నది. వరుసగా ఐదోరోజూ ధరలు పెరగడం విశేషం. అయితే ధరలు పెరుగుతూపోతే మార్కెట్లో స్తబ్ధత నెలకొంటుందని, కస్టమర్లు వేచిచూసే ధోరణిని అవలంభిస్తారని ఆభరణాల వర్తకులు వాపోతున్నారు. దీనివల్ల వ్యాపారం దెబ్బతింటుందని చెప్తున్నారు. నిజానికి ధరలు స్థిరంగా ఉన్నప్పుడే కొనుగోళ్లు బాగా జరుగుతాయని వారు అంటున్నారు.
గ్లోబల్ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 2,827.50 డాలర్లుగా నమోదైంది. క్రితంతో పోల్చితే 7.50 డాలర్లు పెరిగింది. ఔన్స్ సిల్వర్ 32.10 డాలర్లు పలికింది. ఇక భారతీయ ఫ్యూచర్ మార్కెట్లలో బంగారం ఏప్రిల్ నెల కాంట్రాక్టులకుగాను తులం రూ.82,765గా ట్రేడ్ అయ్యింది. మార్చి నెలకుగాను వెండి కిలో రూ.93,650గా ఉన్నది.