ముంబై, జనవరి 19: రూపాయి గింగిరాలు కొడుతున్నది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరువైంది. లోహ దిగుమతిదారుల నుంచి డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో కరెన్సీ తీవ్ర ఒత్తిడికి గురయైంది. వీటికితోడు విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, అనిశ్చిత పరిస్థితులు రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 12 పైసలు కోల్పోయి 90.90 వద్ద నిలిచింది.
90.68 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఇంట్రాడేలో 91.01 కనిష్ఠ స్థాయికి జారుకున్నది. చివరకు గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే 12 పైసలు కోల్పోయి 90.90 వద్ద నిలిచింది. చారిత్రక కనిష్ఠ స్థాయి ముగింపునకు మూడు పైసల దూరంలో నిలిచిపోయింది. గతేడాది డిసెంబర్ 16న ఇంట్రాడేలో చారిత్రక కనిష్ఠ స్థాయి 91.14కి పడిపోయిన విషయం తెలిసిందే. గత శుక్రవారం మారకం విలువ 44 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.