Mahila Samman Savings | మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.. మహిళా ఇన్వెస్టర్లను ప్రోత్సహించేందుకు `మహిళా సమ్మాన్ సేవింగ్స్` తీసుకొస్తున్నామని గత ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గొప్పగా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఫిక్స్డ్ రిటర్న్స్‌తోపాటు పెట్టుబడులకు సేఫ్టీ పథకాల్లో ఒకటి ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్. ఇన్వెస్టర్లు ఫిక్స్డ్ రిటర్న్స్‌తోపాటు సురక్షిత ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతోపాటు ఇప్పటి వరకు అమల్లో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్మెంట్స్, దానిపై వచ్చే ఆదాయానికి ఇన్‌కం టాక్స్ వర్తిస్తుంది. మహిళా సమ్మాన్సేవింగ్స్ స్కీమ్‌కు ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం వచ్చాయి. పలువురు నెటిజన్లు కూడా కేంద్ర ఆర్థికశాఖను ఈ-మెయిల్స్ ద్వారా ఈ విషయమై పలు సందేహాలు తీర్చమని కోరారు. దీనిపై కేంద్రం స్పష్టమైన క్లారిటీ కూడా ఇచ్చింది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద పెట్టుబడులపై వచ్చే ఆదాయంపై ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు వర్తించదని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల ఐదో తేదీన కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే ఈ పథకంలో పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి ఆదాయం పన్ను వర్తిస్తుందన్నమాట.
ఒక్కో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఖాతాలో రూ.2 లక్షల వరకు గరిష్టంగా పెట్టుబడి పెట్టొచ్చు. వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వడ్డీ వర్తిస్తుంది. కేవలం ఈ పథకంలో మాత్రమే పెట్టుబడులు పెట్టినట్లయితే.. దానిపై వచ్చే ఆదాయం మీద టీడీఎస్ డిడక్ట్ చేసే అవకాశం ఉండదు. అదీ కూడా ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై మీ ఆదాయంతోపాటు మీ పన్ను శ్లాబ్‌ను బట్టి మహిళా సమ్మాన్ పథకంలో పెట్టుబడిపై ఆదాయం మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలా.. వద్దా అని ఐటీ శాఖ అధికారులు నిర్ణయిస్తారు. కనుక ఇతర పన్ను ఆదా పథకాల మాదిరిగా దీనిపై టాక్స్ బెనిఫిట్లు మీరు క్లయిమ్ చేయలేరు.