Paytm Insurance | ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ పేటీఎం తన సేవలను మరింత విస్తరించబోతున్నది. తన యూజర్లకు బీమా సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతించాలని కోరుతున్నది. ఈ మేరకు ఇన్సూరెన్స్ లైసెన్స్ కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుగుతున్నాయి. అయితే, మా అభ్యర్థనను తిరస్కరించినట్లు వదంతులు వచ్చాయి. కానీ, అది అనధికారికం. సూత్రప్రాయంగా తమ లైసెన్స్ అభ్యర్థనను తిరస్కరిస్తామని సంకేతాలిచ్చింది అని పేటీఎం సీఎఫ్‌వో మాధుర్ డియోరా తెలిపారు.
18 నెలల క్రితం అంటే 2020 జూలైలో ముంబై కేంద్రంగా పని చేస్తున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రహేజా క్యూబీఈని టేకోవర్ చేసినట్లు తెలిపింది. క్యూబీఈ ఆస్ట్రేలియా, దేశీయ పార్టనర్ సంస్థ ఎస్ రహేజా గ్రూప్ అనుబంధ ప్రిజం జాన్సన్ సంస్థకు ఇందులో 51 శాతం వాటాలు ఉన్నాయి.
ఒక టెక్నాలజీ సంస్థ క్యూఎల్ ద్వారా మెజారిటీ వాటాలను పేటీఎం వ్యూహాత్మకంగా కొనుగోలు చేసింది. ఇప్పటికీ క్యూబీఈ టేకోవర్‌కు రెగ్యులేటరీ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు పేటీఎం వెల్లడించింది. తమ ఇన్సూరెన్స్ బిజినెస్‌లో స్విట్జర్లాండ్ కేంద్రంగా పని చేస్తున్న స్విస్ రీ రూ.920 కోట్లు (23 శాతం) వాటా కొనుగోలు చేయనున్నట్లు పేటీఎం ప్రకటించింది.