Tata Cars Discounts | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి ఉన్నా.. ఇప్పుడిప్పుడే కొన్ని మోడల్ కార్లతో దూసుకొస్తున్నది టాటా మోటార్స్. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ముందు వరుసలో నిలిచిన టాటా మోటార్స్ తన సేల్స్ పెంచుకోవడానికి జూన్ నెలలో కొన్ని సెలెక్టెడ్ మోడల్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకే ఈ రాయితీలు వర్తిస్తాయి. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ మోడల్ కార్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లకు ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. అవేమిటో ఓ లుక్కేద్దామా.. !
టియాగో పెట్రోల్ వేరియంట్ కారుపై గరిష్టంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. రూ.10 వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్, రూ.20 వేల వరకూ కన్జూమర్ స్కీమ్స్ రూపేణా డిస్కౌంట్ ఉంటుంది.
సీఎన్జీ వేరియంట్ కారుపై గరిష్టంగా రూ.43 వేల వరకు డిస్కౌంట్ ఉంది. కన్జూమర్ స్కీమ్ డిస్కౌంట్ రూ.30 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 అందిస్తున్నారు.
టైగోర్ పెట్రోల్ వేరియంట్ కార్లపై గరిష్టంగా రూ.33 వేలు, సీఎన్జీ వేరియంట్లపై అత్యధికంగా రూ.48 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. వీటిల్లో ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కన్జూమర్ స్కీమ్స్, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి.
టాటా మోటార్స్‌లో పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ఆల్ట్రోజ్ కారుపై గరిష్టంగా రూ.30 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి రిలీజ్ చేసిన సీఎన్జీ వేరియంట్ పై ఏ రాయితీలు ఉండవు. ఎక్స్ఈ, ఎక్స్ఈ + ట్రిమ్ కార్లు మినహా అన్ని పెట్రోల్ వేరియంట్లపై గరిష్టంగా రూ.25 వేల డిస్కౌంట్, ఎక్స్ఈ, ఎక్స్ఈ + ట్రిమ్ కార్లపై రూ.10 వేలు, అన్ని రకాల డీజిల్ వేరియంట్లపై రూ.30 వేల వరకు రాయితీ ఇస్తున్నది.
హారియర్, సఫారీ ఎస్ యూవీ కార్లపై గరిష్టంగా రూ.35 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేలు లభిస్తుంది. ఈ రెండు మోడల్ కార్లపై కన్జూమర్ బెనిఫిట్ స్కీమ్స్ ఆఫర్ చేయడం లేదు.