Hyundai Venue | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూ పై భారీగా రూ.80 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ, మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ కార్లకు హ్యుండాయ్ వెన్యూ గట్టి పోటీ ఇస్తోంది. ఈ నెలాఖరు వరకే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. వెన్యూతోపాటు ఎక్స్ టర్, క్రెటా, అల్కాజర్, టక్సన్ వంటి కార్లపైనా ఆఫర్లు అందిస్తోంది హ్యుండాయ్ మోటార్ ఇండియా.
గత నెలలో హ్యుండాయ్ 10,259 యూనిట్ల వెన్యూ కార్లు విక్రయించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 13,874 యూనిట్లు విక్రయిస్తే, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ తొమ్మిది వేల యూనిట్లు, కియా సోనెట్ 10,335, మారుతి బ్రెజా 15,322, టాటా నెక్సాన్ 11,470 యూనిట్లు అమ్ముడయ్యాయి.
గరిష్టంగా హ్యుండాయ్ వెన్యూపై రూ.80,629 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బోనస్ తదితరాలు ఉన్నాయి. హ్యుండాయ్ వెన్యూ కారు ధర రూ.7.94 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
హ్యుండాయ్ వెన్యూ మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. కప్పా 1.2 లీటర్ల ఎంపీఐ పెట్రోల్ (83 పీఎస్ విద్యుత్ – 113.8 ఎన్ఎం టార్క్), కప్పా 1.0 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ (120 పీఎస్ విద్యుత్, 172 ఎన్ఎం టార్క్), యూ2 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్) ఇంజిన్ ఆప్షన్లతో వస్తోంది. 1.2 లీటర్ల ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 1.0 లీటర్ల టర్బో జీడీఐ యూనిట్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డీసీటీ చాయిస్, 1.5 లీటర్ల సీఆర్డీఐ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.