న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆయా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ.. పాలసీ రెన్యువల్‌పై రాయితీని ఆలోచించాలని బీమా కంపెనీలను కోరింది. కొవిడ్-19 వ్యాక్సిన్ 3 డోసులు తీసుకున్న పాలసీదారులకు జనరల్, ఆరోగ్య బీమా పాలసీల రెన్యువల్స్‌లో డిస్కౌంట్‌ను పరిశీలించాలని సూచించింది. అలాగే కరోనా సంబంధిత క్లెయిముల్లో చెల్లింపులను వేగంగా జరుపాలని, పేపర్ వర్క్‌ను సైతం తగ్గించాలని లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏఐ ఆదేశించినట్టు చెప్తున్నారు. కరోనాపై అవగాహనను పెంచడానికి గతవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఐఆర్డీఏఐ సూచనలు, నిర్ణయాలు, ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తున్నది. పాలసీదారులు తమ వెల్నెస్ నెట్వర్క్ ద్వారా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకుంటున్నట్టయితే బీమా రంగ సంస్థలు తగు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని ఐఆర్డీఏఐ ఈ సందర్భంగా సూచించిందని చెప్తున్నారు. విదేశీ ప్రయాణ బీమాదారులకు.. వివిధ దేశాల్లో కరోనా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా తెలియజేయాలని కూడా బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. కరోనా తొలి, రెండో వేవ్‌ల్లో ఆరోగ్య బీమా పాలసీదారులకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సౌకర్యమున్నా దవాఖానలు రోగుల వద్ద డిపాజిట్లు తీసుకోవడాన్ని ఐఆర్డీఏఐ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఎంప్యానెల్డ్ ఆస్పత్రులు ఇలా డిపాజిట్లు తీసుకోకుండా నిషేధం విధించాలని బీమా సంస్థలకు స్పష్టం చేసింది.