Salary Hikes | బెంగళూరు, జూలై 18: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం (2023-24) నిరాశనే మిగిల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలను రెండంకెల స్థాయి వృద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు.. గత ఆర్థిక సంవత్సరం మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశాయి మరి. దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీల్లో మూడింట్లో వ్యయ నియంత్రణ చర్యలు స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయా సంస్థలకు ఖర్చుల కట్టడి తప్పట్లేదు. ఇందులోభాగంగానే ఉద్యోగులకు వార్షిక వేతనాల పెంపులో కోత పెడుతున్నాయి. దీంతో మెజారిటీ ఐటీ ఉద్యోగులకు ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 5 శాతం నుంచి 9 శాతం మేరకే సాలరీల్లో ఇంక్రిమెంట్లు దక్కాయి.
దిగ్గజ సంస్థల్లో..
దేశీయ ఐటీ రంగ సంస్థల్లో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీతాలు సగటున 9 శాతమే పెరిగాయి. ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్లోనైతే 7-9 శాతమే. విప్రో విషయానికొస్తే.. 2023-24లో 9.4 శాతంగా ఉంటే.. టెక్ మహీంద్రాలో 5.6 శాతమే. కాగా, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ 2021-22లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలకు రెండంకెల స్థాయిలో పెంపు శాతాన్నిచ్చాయి. టెక్ మహీంద్రా 5.2 శాతం, హెచ్‌సీఎల్ 6.8 శాతంతోనే సరిపెట్టాయి.
ప్రతికూలతల వల్లే..
భారీ సంఖ్యలో ఉద్యోగులు, పెరుగుతున్న వ్యాపార ఖర్చులు.. భారతీయ ఐటీ రంగాన్ని దెబ్బతీస్తున్నట్టు రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ మిషెల్ పేజ్ ప్రతినిధి ప్రన్షు ఉపాధ్యాయ్ అన్నారు. సంస్థాగత ఆదాయం-లాభాలు తగ్గడంతో దానికి తగ్గట్టుగానే పొదుపు మంత్రం జపిస్తున్నాయన్నారు. ఇక ప్రవేశ స్థాయిలో ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత లేకపోవడం కూడా సమస్యగా మారిందని చెప్పారు. కాగా, సంక్లిష్టమైన సాంకేతిక నైపుణ్యాలను కలిగిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం సగటున సాలరీలు పెరుగుతున్నట్టు రాండ్‌స్టడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా తెలిపారు.
ఆయా సంస్థలు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తుండటంతో ప్రతిభావంతులకు సహజంగానే పెద్దపీట దక్కుతున్నదని తెలియజేశారు. వారి అవసరాలు బాగా ఉండటంతోనే జీతాలు అంతలా పెరుగుతున్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) ఏఐ, ఎంఎల్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డాటా అనలిటిక్స్ విభాగాల్లో నిపుణులకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని ఆయన అంచనా వేశారు.
మున్ముందూ తిప్పలే
దేశ, విదేశాల్లో నెలకొన్న ఆర్థిక మందగమనం ఛాయలు.. భారతీయ ఐటీ కంపెనీలకు మున్ముందు మరిన్ని ఇబ్బందులను సృష్టించగలవన్న అభిప్రాయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక సంక్షోభపు పరిస్థితులు.. దేశీయ ఐటీ కంపెనీల ఆదాయానికి ఇప్పటికే గండి కొడుతున్నాయని వారు గుర్తుచేస్తున్నారు.
అందుకే భారీగా ఉద్యోగ కోతలు, అంతంతమాత్రంగా జీతాల పెంపులని ఐటీ రంగ నిపుణులు ప్రస్తుత సరళిని విశ్లేషిస్తున్నారు. అగ్ర దేశాల రక్షణాత్మక ధోరణులు, వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కూడా ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులు మారకపోతే ఐటీయేగాక అన్ని రంగాల మనుగడకు ముప్పేనని హెచ్చరిస్తుండటం గమనార్హం.
