న్యూఢిల్లీ, జూలై 13: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రెండంకెల వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19.54 శాతం పెరిగి రూ.5.74 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది.
కార్పొరేట్ సంస్థలు అధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు జరపడం ఇందుకు కారణమని తెలిపింది. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 27.34 శాతం ఎగబాకి రూ.1.48 లక్షల కోట్లకు చేరాయి. దీంట్లో కార్పొరేషన్ ఆదాయ పన్ను(సీఐటీ) వసూళ్లు 1.14 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) రూ.34,470 కోట్లని పేర్కొంది.
ఈ నెల 11 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5,74,357 కోట్లు కాగా, వీటిలో సీఐటీ రూ.2,10,274 కోట్లు, పీఐటీ రూ.3,46,036 కోట్లని తెలిపింది. అలాగే రూ.70,902 కోట్లను రిఫండ్ రూపంలో చెల్లించింది.