హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కాంగ్రెస్ సర్కార్ పరిపాలన. ఒప్పందాలు మాత్రం లక్షల కోట్ల స్థాయిలో ఉన్నట్టు ఘనంగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ సర్కార్కు వచ్చిన పెట్టుబడులు చూస్తే మాత్రం షాక్ తగులుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గడిచిన రెండేండ్లలో రూ. 8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ సదస్సు సందర్భంగా ప్రకటించింది. కాగా, డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య టీజీఐఐసీ ద్వారా 998 యూనిట్లకు భూములు కేటాయించగా, ఆ యూనిట్లు పెడుతున్న పెట్టుబడులు రూ. 88,534 కోట్లని తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనమిక్ ఔట్లుక్-2026లో వెల్లడించారు. అంటే, ఇప్పటివరకు జరిగిన ఒప్పందాల్లో పదిశాతం వరకు కంపెనీలు మాత్రమే ప్రారంభించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తున్నది. ఎకనమిక్ ఔట్లుక్ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక టీజీఐఐసీ 998 యూనిట్లకు 2,195 ఎకరాల భూములు కేటాయించింది. దీనిద్వారా రూ. 88,534 కోట్ల పెట్టుబడులు, 75,008 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. కానీ, మొత్తంగా టీజీఐఐసీ తెలిపిన వివరాల ప్రకారం రెండేండ్లలో సుమారు 3 వేల యూనిట్లకు అనుమతులు మంజూరు చేయగా, అందులో దాదాపు 90 శాతానికిపైగా కంపెనీలు ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవే కావడం విశేషం. అయితే, ఇందులో దాదాపు 2 వేలకుపైగా యూనిట్లు టీజీఐఐసీ భూములతో సంబంధం లేకుండా సొంత జాగల్లోనే ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలావుంటే, పెట్టుబడులను ఆకట్టుకోవడానికి పలుమార్లు విదేశీ పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు కానీ, వాస్తవరూపం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి ఎదురవుతున్న సమస్యల వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కార్పొరేట్ దిగ్గజాలు ముందుకురావడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా ఉంచిన భూములను సైతం అభివృద్ధి చేసి పరిశ్రమలకు కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించడం, అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం అన్నిరంగాల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా గ్రీన్ ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. రాష్ట్రంలో ఫార్మారంగ అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలుండటంతో గత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అప్పట్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం, ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించడంతో ఔషధ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. అలాగే, సెమీకండక్టర్ల పరిశ్రమకు రాష్ట్రంలో సరైన విధంగా రాయితీలు ఇవ్వకపోవడం, గుజరాత్, ఏపీ వంటి రాష్ర్టాలు పుష్కలంగా ప్రోత్సాహకాలు కల్పించడంతో సెమీకండక్టర్ల పరిశ్రమ కూడా రాష్ర్టానికి రాకుండా తరలిపోయింది. అలాగే, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో వివిధ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు చేసుకునేందుకు ముందుకొస్తున్నాయి. తీరా ఇక్కడికి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిస్థితులు, రాష్ట్ర సర్కార్ కల్పిస్తున్న రాయితీలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకొని ఆయా కంపెనీలు పునరాలోచనలో పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తమ్మీద సర్కార్ చెబుతున్న పెట్టుబడులకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన కుదరడంలేదని చెప్పవచ్చు.