హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): వ్యాపారాలు, సంస్థలు, ప్రభుత్వాల ఆర్థిక భద్రత చార్టెడ్ అకౌంటెంట్ల (సీఏ) చేతుల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. సీఏలు నైతికతకు కట్టుబడి ఉండాలని, ఏఐ టెక్నాలజీ యుగంలో నిజాయితీయే మీకు అత్యంత విలువైన ఆస్తి, పనిలో ఎల్లప్పుడూ నిజాయితీ ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. సీఏ బాధ్యతలు బ్యాలెన్స్ షీట్కే పరిమితం కాబోవని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఐసీఏఐ, హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో నగరంలో గురువారం ఏర్పాటుచేసిన సీఏ విద్యార్థుల జాతీయస్థాయి సదస్సులో భట్టి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతున్నదని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ.. దేశవ్యాప్తంగా బయటికి వస్తున్న సీఏ విద్యార్థులకు కూడా వేదికగా మారిందని వెల్లడించారు. సీఏ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు రాష్ట్రంలో అవకాశాలు పుషలంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
భారతదేశ ఆర్థిక, ధన, వినియోగ నైతికతకు మూలస్తంభంగా ఐసీఏఐ నిలుస్తున్నదని తెలిపారు. బిజినెస్ సంస్కరణలు, స్టార్టప్లకు చేయూత, ప్రజా ఆర్థిక వ్యవస్థల బలోపేతం ఇవన్నీ సీఏల పాత్రతోనే ముందుకు సాగుతాయని చెప్పారు. సీఏలు ఉద్యోగులు కాకుండా ఉద్యోగ దాతలుగా మారాలని, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.