హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊహకు అందదని తెలిపారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐ నూతన కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి వందేండ్లకుపైగా అనుభవం ఉన్నదని, హైదరాబాద్ ఒక వర్తక నగరం నుంచి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే వరకు ప్రతి దశలోనూ ఎఫ్టీసీసీఐ ముందు నడిచిందని పేర్కొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య ఐటీ, ఫార్మా, హౌసింగ్ వంటి అనేక క్లస్టర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నామని, వాటిని అభ్యుదయ పారిశ్రామికవేత్తలకు కేటాయించి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలు కోరినట్టు పెండింగ్లో ఉన్న పవర్ బిల్లులను సింగిల్ టైం సెటిల్మెంట్ విషయంపై ఆలోచన చేస్తామని చెప్పారు. సంపద సృష్టికర్తలైన పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కొత్త ఆవిషరణలు, ప్రతిభ, కష్టపడేతత్వంతో కొత్త సంపద రూపొందించేందుకు హైదరాబాద్ ఒక గని లాంటిదని చెప్పారు.