Demat Accounts | మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినా, దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేయాలన్నా బ్యాంకుల్లో డీ-మ్యాట్ ఖాతాలు తెరవడం తప్పనిసరి. దేశంలో డీమ్యాట్ ఖాతాలు కొత్త రికార్డు నమోదు చేశాయి. భారత్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరంలో డీమ్యాట్ ఖాతాలు కొత్తగా 3.70 కోట్ల ఖాతాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఆకర్షణీయ లాభాలు వస్తుండటంతో ఇన్వెస్టర్లలో సానుకూలత నెలకొంది. ప్రతి నెలా సరాసరి 30 లక్షల మందికి పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలను తెరుస్తున్నారు. దీంతో డీమ్యాట్ ఖాతాలు 15 కోట్లకు చేరాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత్ మార్కెట్‌పై మనస్సు పారేసుకున్నారు. మరోవైపు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి పెరిగింది. స్టాక్ మార్కెట్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులతో 2023-24లో డీమ్యాట్ ఖాతాల సంఖ్య 3.7 కోట్లకు చేరుకున్నది. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం ఎక్కువ.
గతేడాది మార్చిలో స్టాక్ మార్కెట్లు కనిష్టాలకు చేరుకోవడంతో రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు దిగారు. మరోవైపు ఐపీఓల ద్వారా పలు సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావడం కూడా డీమ్యాట్ ఖాతాలు పెరగడానికి కారణం. గత ఆర్థిక సంవత్సరంలో 76 కంపెనీలు ఐపీఓ ద్వారా రూ.61,291 కోట్లు సమీకరించాయి.