Demat A/C KYC Update | దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు కల కస్టమర్లకు రిలీఫ్ లభించింది. ఈ ఖాతాదారులు తమ ఖాతాలు ఉన్న బ్యాంకుల్లో కేవైసీ (నో యువర్ కస్టమర్ – KYC) పత్రాలను సమర్పించడానికి గడువు మూడు నెలలు పొడిగిస్తూ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతకుముందు గత నెలాఖరు (2022 మార్చి 31) వరకు గడువు విధించిన ఎన్ఎస్డీఎల్.. తాజా ఆదేశాల్లో జూన్ 30 వరకు పొడిగించింది.
ట్రేడర్లు తమ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి కేవైసీ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. అవసరమైన కేవైసీ పత్రాలు సమర్పించాలని పలువురు స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లను ఇప్పటికే సమాచారం పంపించారు. అయితే, సంబంధిత ట్రేడర్లు, స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ట్రేడింగ్ చేసే ఖాతాదారులు తమ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ పత్రాలను జూన్ వరకు సమర్పించవచ్చు. సెబీతోనూ, ఎంఐఐలు, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాత డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ చేయడానికి ఒకసారి గడువు పొడిగించాలని నిర్ణయించినట్లు ఎన్ఎస్డీఎల్ తెలిపింది.
డీమ్యాట్ ఖాతాదారులు, ట్రేడింగ్ ఖాతాదారులు చాలా కాలం క్రితం తమ బ్యాంకులకు, స్టాక్ బ్రోకర్లకు కేవైసీ పత్రాలు అంద చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు కేవైసీ పత్రాలను అప్డేట్ చేయలేదు. ఈ నేపథ్యంలో డీమ్యాట్ ఖాతాదారులు, ట్రేడింగ్ ఖాతాదారులు ఆరు కేవైసీ అంశాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఏ) పేరు
బీ) చిరునామా
సీ) పాన్
డీ) చెల్లుబాటయ్యే మొబైల్ ఫోన్ నంబర్ (బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసిన మొబైల్ నంబర్)
ఈ) చెల్లుబాటయ్యే ఈ-మెయిల్ ఐడీ (బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసిన ఈ-మెయిల్ ఐడీ)
ఎఫ్) ఆదాయం శ్రేణి
గతేడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ఆరు కేవైసీ సమాచారం అప్డేట్ చేయడం తప్పనిసరి చేశారు. దీంతోపాటు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. వ్యక్తులు తమ ఆధార్- పాన్ కార్డుల అనుసంధానం కోసం శుక్రవారం (2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 30 వరకు రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.1000 ఫైన్ చెల్లించాలి. లేని పక్షంలో వచ్చే ఏడాది మార్చి వరకు పాన్‌కార్డ్ చెల్లుబాటు కాదు.