న్యూఢిల్లీ, మే 6 : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే దేశంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న యుద్ధం సెగ..తాజాగా దేశీయ ఆటోమొబైల్ రంగ సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రధానంగా మోటార్‌సైకిళ్లకు డిమాండ్ అంతకంతకు పడిపోనున్నదని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ప్రధానంగా మోటార్‌సైకిళ్లతోపాటు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ బైకులు, స్కూటర్లకు డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా కన్జ్యూమర్ సెంటిమెంట్ క్రమంగా పడిపోతున్నదని, ఇదే సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మోటార్‌సైకిల్ సెగ్మెంట్ 20 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఈసారి మాత్రం సింగిల్ డిజిట్‌కు పరిమితంకానున్నదని ఆయన చెప్పారు. మధ్యప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ సంక్షోభంతో తలెత్తిన అన్ని రకాల పరిణామాల కారణంగా గడిచిన రెండు నెలల్లో కీలక మలుపు చోటు చేసుకుందన్నారు. ఈ క్రమంలో వంటగ్యాస్ కొరత తీవ్రతరం కావడం, సరఫరా వ్యవస్థ అరకొరగా ఉండటంతో కన్జ్యూమర్ సెంటిమెంట్ నీరుగారిందని, ముఖ్యంగా ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం బుసలుకొడుతుండటంతో ఆటోమొబైల్ రంగంపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడనున్నదన్నారు.
వంటగ్యాస్ కొరతతోపాటు కార్మికుల కొరత కూడా తీవ్రతరం కావడంతో ఆటోమొబైల్ రంగ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. డిమాండ్ వాతావరణం కఠినంగా మారినప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కానీ, 150 సీసీ కంటే అధిక కెపాసిటీ కలిగిన బైకులకు మాత్రం డిమాండ్ ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. 150 సీసీ కంటే అధిక కెపాసిటీ కలిగిన బైకుల సెగ్మెంట్లో బజాజ్ ఆటో చాలా బలంగా ఉన్నదని, ఇండస్ట్రీ కంటే సంస్థ అధిక వృద్ధిని నమోదు చేసుకుంటుందన్నారు. మరోవైపు, కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎనలేని డిమాండ్ నెలకొన్నదని, గతేడాది నాలుగో త్రైమాసికంలో 40 శాతం వృద్ధి సాధించిందని, అలాగే ఏప్రిల్ నెలలో 60 శాతానికి పైగా వృద్ధి నమోదైందన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు, చమురు ధరలు భగ్గుమంటుండటంతో దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నదని, ప్రస్తుతం 20 శాతం వృద్ధితో దూసుకుపోతున్న దేశీయ ఆటోమొబైల్ రంగం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదని ఆయన అన్నారు. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ఇప్పటికే పలు కంపెనీలు తమ వాహన ధరలను పెంచాయని, జీఎస్టీ వల్ల కలిగిన ప్రయోజనం కంటే అధికంగా 30-40 శాతం వరకు ధరలు పెరిగాయన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,492.21 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నమోదైన రూ.1,801.85 కోట్ల లాభంతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు పెరిగినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం రూ.12,646.32 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.17,832.46 కోట్లకు ఎగబాకింది. నిర్వహణ ఖర్చులు కూడా రూ.10,219 కోట్ల నుంచి రూ.15,390 కోట్లకు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.62,905 కోట్ల ఆదాయంపై రూ.10,574 కోట్ల లాభాన్ని గడించింది.