Hyderabad | హైదరాబాద్, మే 8: లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లోనూ హైదరాబాద్ పరుగులు పెడుతున్నది. సకల సదుపాయాలు కలిగిన ఖరీదైన నివాసాలకు రాజధాని నగరంలో భలే గిరాకీ కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే ఏకంగా 8 రెట్లకుపైగా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడైనట్టు తేలింది. హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాలపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
ఇందులో గత ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో 50 లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇవి 430కి చేరాయి. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై మార్కెట్లకు సంబంధించి సీబీఆర్ఈ రిపోర్టు ఇచ్చింది. ఈ ఏడు నగరాల్లో ఈ జనవరి-మార్చిలో 4,000 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. నిరుడు అమ్మకాలు 1,600 లుగానే ఉన్నాయి. కాగా, ఢిల్లీ, ముంబై తర్వాత ఎక్కువగా హైదరాబాద్‌లోనే అమ్మకాలు నమోదవడం గమనార్హం. రూ.4 కోట్లు, ఆపై విలువ కలిగిన నివాస విక్రయాలనే లెక్కించారు.