Dell | కరోనా సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని కంపెనీలు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఆఫీసుకే వచ్చి పనిచేయాలని ఉద్యోగులకు ఆదేశాలివ్వగా.. పలు కంపెనీలు హైబ్రీడ్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ కంపెనీ డెల్ కూడా WFHకు శాశ్వతంగా స్వస్తి పలికింది.
హైబ్రీడ్, రిమోట్ వర్క్ పాలసీలకు తాజాగా డెల్ కంపెనీ గుడ్‌బై చెప్పేసింది. ఈ మేరకు డెల్ సీఈవో మైఖేల్ డెల్ ఉద్యోగులకు సమాచారం అందించారు. మార్చి 3వ తేదీ నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుందని తెలిపారు. అప్పటి నుంచి డెల్ కార్యాలయాలకు దగ్గరగా ఉండే ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని సూచించారు. డెల్ కార్యాలయాలకు సమీపంలో గంట ప్రయాణ సమయం ఉన్న ఉద్యోగులకు ఈ కొత్త ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. మరింత దూరంలో నివసించే ఉద్యోగులు రిమోట్‌గా పనిచేసేందుకు సీనియర్ లీడర్ల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు తగిన కారణాలు చూపించాలి.. లేదంటే వారికి ప్రమోషన్స్ ఉండవని తెలుస్తోంది. ఇకపై కొత్తగా నియమించుకునే ఉద్యోగులకు మాత్రం రిమోట్ విధానం అస్సలే ఉండదని సమాచారం.
ప్రపంచంలోని మెరుగైన అన్ని టెక్నాలజీలకు మనుషుల మధ్య ఉన్న సంబంధం, చర్చలే కారణమని డెల్ సీఈవో మైఖేల్ అభిప్రాయపడ్డారు. అందరూ కలిసి పనిచేయడం, తమ ఆలోచనలు పంచుకోవడం వల్ల సంస్థ వృద్ధి చెందుతుందని చెప్పారు. డెల్ సీఈవో తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.