ఇంజినీర్ కావడానికి ఓ కోర్స్ ఉంది .. డాక్టర్ కావడానికి ఓ కోర్స్ ఉంది .. టీచర్ కావడానికీ ఉంది.. మరి ప్రేమికుడో, ప్రేమికురాలో కావడానికి కోర్స్ ఉందా? మరీ విచిత్రం కాకపోతే ప్రేమించడానికి కోర్స్ ఏంటండీ అనుకుంటే పొరపడినట్లే. మిగిలిన కోర్సులన్నీ జీతాన్ని ఇస్తే, ఈ లవ్ కోర్స్ జీవితాన్ని ఇస్తుంది. ఈ సంగతి గ్రహించే ఢిల్లీ యూనివర్సిటీ ఈ ఏడాది నుంచి విద్యార్థులకు లవ్ కోర్స్ ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా ఓ సిలబస్ రూపొందించి, విద్యార్థులకు ప్రేమ పాఠాలను చెప్పనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకు ఈ కోర్సు అవసరమే అని చెప్పకతప్పదు.
ప్రేమ .. ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ప్రేమించడం, ప్రేమను పొందడం రెండూ ప్రతీ ఒక్కరి జీవితంలో సంభవించేవే. భార్యాభర్తల దాంపత్యం అన్యోన్యంగా సాగాలన్నా, బంధం పది కాలాలపాటు నిలవాలన్నా ప్రేమ ఉండాల్సిందే. ప్రేమ జీవితాలను మార్చగలదు, తప్పు దోవ పట్టించగలదు. ప్రేమ రాహిత్యమే ఇప్పుడు మనం చూస్తున్న విపరీతాలకు కారణం. ఇంతటి మహత్తర శక్తి ఉన్న ప్రేమ గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. నేటి యువత దాని చుట్టూ చేరిన కొన్ని అపోహలు, అవాస్తవాలను ప్రేమ అనుకుని ఇబ్బందులు పడుతున్నది.
సిట్యుయేషన్ షిప్, బెంచింగ్, ఘోస్టింగ్, బ్రెడ్ క్రమింగ్ .. ఏంట్రా ఈ పదాలు ఆల్జీబ్రాలా అర్థం కావడం లేదు అనుకుంటున్నారా? ఇవి జనరేషన్ జెడ్ ప్రేమకు పెట్టుకున్న పేర్లు. ఒక్కొక్కటీ ఒక్కొక్క తీరు ప్రేమ. ఈ తీర్లు నిజంగానే పాతతరాల వారికి అర్థం కావు. పోనీ, ఈ తరానికైనా అర్థమవుతున్నాయా అంటే.. సందేహమే! ఈ తరం ప్రేమకు పేర్లు ఏమైనా సరే కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే. ఎటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం, ప్రేమ బంధాన్ని శారీరక, ఆర్థిక అవసరాల కోణంలో చూడటం. మానసిక, భావోద్వేగ అంశాలను మర్చిపోవడం. నేటితరం అసలు ప్రేమంటే ఏంటి, సమాజానికి, మనుషులకు అది ఎందుకు అవసరం, దాని మూలాలు ఏంటి అని తెలుసుకోలేక తడబడుతున్నది. లేనిపోని ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నది.
ఓ మారుమూల గ్రామంలోని కుర్రోడు. పోలీస్ ఆఫీసర్‌కు దక్కే గౌరవం చూసి ఐపీఎస్ కావాలనుకున్నాడు. నానా కష్టాలు పడి ఓ మోస్తరు మార్కులతో డిగ్రీ పాసయ్యాడు. సివిల్స్ కోచింగ్ కోసం పట్నానికి వచ్చాడు. అక్కడే ఓ అమ్మాయి పరిచయమైంది. సివిల్స్ ప్రిపరేషన్లో సాయంగా నిలిచింది. ఈ కుర్రోడు తెలియకుండానే ఆ అమ్మాయితో ప్రేమలోపడ్డాడు. తను ఐశ్వర్యవంతురాలు, ఆర్థిక అంతరాలను దాటి తన ప్రేమను దక్కించుకోవాలంటే ఐపీఎస్ సాధించడమే మార్గమని అనుకున్నాడు. శ్రమించాడు, ఐపీఎస్ సాధించాడు. ఆనక ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకున్నాడు. ఇదీ ఓ ఐపీఎస్ నిజ జీవిత ప్రేమ కథ, ఆ మధ్య మనం చూసిన.. 12 ఫెయిల్ సినిమా. సరైన ప్రేమ చోదక శక్తిగా పనిచేస్తుందని థియరీ ఆఫ్ లవ్ ఎనర్జీ చెబుతుంది. ఈ శక్తి ఏటికి ఎదురీదే ధైర్యాన్ని ఇస్తుంది, లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదల ఇస్తుంది. జీవిత భాగస్వామితో ప్రేమ బంధం బలంగా ఉన్న వ్యక్తులు వృద్ధాప్యంలో చాలా సంతోషంగా ఉన్నారని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇంతటి మహత్తర శక్తి ఉన్న ప్రేమను తాత్కాలిక అవసరాల కోసం, తక్షణ సంతృప్తుల కోసం వాడుకోవడమే నేటితరం చేస్తున్న పెద్ద పొరపాటు. ఈ పొరపాటును సరిదిద్దడానికి ప్రేమ పాఠాలు అవసరమే మరి.
ఇది ఇలా ఉంటే మరో కథ ఉంది. ఇన్‌స్టా లోనో, ఫేస్బుక్ లోనో ఫ్రెండ్ అవుతారు. ఫాలో అవుతూ ప్రతి పోస్ట్‌కి కామెంట్ పెడతారు. ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి అనేలా చేస్తారు. నెమ్మదిగా లవ్ అంటారు, ఆర్థిక అవసరాలు, శారీరక అవసరాలు తీర్చుకుంటారు. మోజు తీరాక మళ్లీ ఇంకొకరిని ముగ్గులో దించే ప్రయత్నంలో ఉంటారు. దీన్నే క్యాట్ ఫిషింగ్ అంటారు. దీనిబారినపడి మోసపోయిన వారిలో అమ్మాయిలు, అబ్బాయిలే కాదు, 40 ఏళ్లు దాటిన మహిళలు, పురుషులు కూడా ఉన్నారు. స్లో బర్న్ రిలేషన్షిప్ అంటే ఏంటో తెలియకపోవటంతో వచ్చే అనర్థం ఇది. అపరిపక్వ ప్రేమలో మరో డేంజర్ ఉంది. నువ్వే నా జీవితం అంటారు, నీ ప్రేమ నాకే సొంతం అంటారు. తోబుట్టువులు, స్నేహితులతోనూ ఎవరితో మాట్లాడకూడదు అంటారు, అందరినీ దూరం చేస్తారు. అడుగడుగునా అనుమానంతో అవమాన పరుస్తూ ఉంటారు. దీన్నే గ్యాస్ లైటింగ్ అంటారు. మొదట్లోనే దీన్ని గుర్తించకుండా పెళ్లితో శాశ్వత బంధంలోకి వెళితే జీవితమంతా నరక ప్రాయమే. ప్రేమలోని ఈ పెడ ధోరణుల గురించి తెలుసుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
డేటింగ్ యాప్స్, ఆన్లైన్ రిలేషన్‌షిప్స్‌తో ఏర్పడిన ప్రేమ బంధాలతో నేటి యువత సతమతమవుతున్నది. రిలేషన్ షిప్, బ్రేకప్, ఆన్లైన్ స్టాకింగ్ తదితర అంశాలపై అవగాహన ఉంటే బంధాలను ఏర్పరచుకోవడంలో జాగ్రత్త పడతారు. వచ్చిన చిక్కల్లా ఏంటంటే.. వీటి గురించి చెప్పేవారు లేకపోవడమే. ఇంట్లో గాని కాలేజీలో గాని వీటి గురించి చెప్పకపోవడంతో యువతరం తప్పటడుగులు వేస్తోంది. ప్రేమలో ప్రమాదం ఉంటుంది, ప్రేమించొద్దు అని చెప్పడం కంటే, అసలు నిజమైన ప్రేమంటే ఏమిటి, దాన్ని ఎలా నిలుపుకోవాలి, విఫలమైతే ఎలా నిలబడాలి, స్వార్థ ప్రయోజనాలతో ఉన్న ప్రేమను ఎలా గుర్తించాలి అనే అంశాలను స్కూల్స్‌లో, కాలేజీల్లో సిలబస్‌గా చేర్చి పాఠాలను చెప్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అసలు ప్రేమంటే ఏంటి? మనుషుల్లో ఎందుకు పుడుతుంది? ఏది నిజమైన ప్రేమ?.. ఈ ప్రశ్నలు చాలా కాలం నుంచి సైకాలజిస్టులను వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి సమాధానం కోసం నేటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో నుంచే అనేక ప్రేమ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. లైకింగ్ థియరీ, కలర్ వీల్ థియరీ, అటాచ్మెంట్ థియరీ, ట్రయాంగిల్ థియరీ.. ఎన్నో థియరీలు ప్రేమను వివరించడానికి ప్రయత్నించాయి. నేటి తరానికి వీటిపై కనీస అవగాహన లేకపోవడమే అసలు సమస్య.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261