కంప్యూటర్, ల్యాపీ లేకుండా ఒక్కరోజు గడవడం అసాధ్యం. ఐటీ జాబ్ చేసే ఉద్యోగి.. డిగ్రీ చదివే విద్యార్థి.. స్టార్టప్ నడిపే యువ ఆంత్రప్రెన్యూర్.. ఎవరైనా కావచ్చు. గంటలు గంటలు వాటిపైనే పని. ఈ క్రమంలో చాలామంది గమనించరు గానీ.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మౌస్ ఎక్కువగా వాడటం వల్ల మణికట్టు దగ్గర నల్లగా కాయ కాసేస్తుంది. మోచేయి గుంజడం.. నడుం నొప్పి.. మెడ లాగడం.. కాళ్ల తిమ్మిర్లు ఇలా పలు రకాల సమస్యలు వస్తుంటాయి. వాటిని గమనించకపోతే, పెద్ద అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు.అందుకే స్మార్ట్‌గా పని చేయాలి. అందుకే ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లు. వీటిని వాడితే పని ప్రశాంతంగా సాగిపోతుంది! ప్రయత్నించి చూడండి.
మోచేతికి మంచి సపోర్ట్
చేయి లాగడం.. భుజం నొప్పి సమస్యలకు ఆర్మ్ రెస్ట్ ప్యాడ్‌ను వాడొచ్చు. ఇది చేతికి, భుజానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. దీన్ని టేబుల్, ఆఫీస్ డెస్క్‌కు సులభంగా అమర్చుకోవచ్చు. దీంట్లో ఉండే మెమరీ ఫోమ్ మెత్తగా ఉండి, మన చేతిమీద ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మెడ, చేతులు, భుజాల మీద ఎక్కువ స్ట్రెయిన్ పడదు. ఇది వాడేటప్పుడు చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. ప్యాడ్‌ను 180 డిగ్రీల్లో ఎటైనా తిప్పుకోవచ్చు. కుడి, ఎడమ చేతులకు అనుకూలంగా దీన్ని మార్చుకోవచ్చు. ఐప్యాడ్లపై డ్రాయింగ్స్ వేసేవారికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని బ్యాగులో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఎప్పుడైనా అవసరం లేకపోతే పక్కకు తిప్పి పెట్టుకోవచ్చు.
కాళ్ల తిమ్మిర్లకు చెక్
ఇంటి నుంచి పని చేసేవారికి, ఆఫీసులో గంటల తరబడి కూర్చునే వారికి ఎర్గోనామిక్ ఫుట్‌రెస్ట్ చక్కని ఆప్షన్. వెన్ను, కాళ్లకు మంచి సపోర్ట్ ఇస్తుంది. కూర్చునే భంగిమ మెరుగుపడుతుంది. పాదాలు, కాళ్లు, వెన్నుకు సరైన సపోర్ట్ దొరుకుతుంది. కుర్చీలో కూర్చుని కాళ్లు దీనిపైన పెట్టుకోవచ్చు. ఈ ఫుట్‌రెస్ట్‌ను మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఎత్తును ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలుంది. సోఫా మీద కూర్చున్నప్పుడు కూడా చక్కగా వాడుకోవచ్చు. ఫుట్‌రెస్ట్ మధ్యలో ఉన్న ‘మసాజ్ రోలర్స్’ తో పాదాలను మసాజ్ చేసుకోవచ్చు కూడా. స్టాండ్ కింద ఉన్న యాంటి స్లిప్ ప్యాడ్స్.. ఫుట్‌రెస్ట్ జారకుండా పట్టుకుంటాయి. సైజు చిన్నగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
మణికట్టు పట్టు తప్పకుండా!
కంప్యూటర్, ల్యాప్‌టాప్.. దేనిపై పని చేస్తున్నా మౌస్ వాడకం అనివార్యం. ఈ క్రమంలో చేతి మణికట్టు నొప్పి, కీళ్ల సమస్యలు మామూలే. ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు రిస్ట్ రెస్ట్ ప్యాడ్స్‌ను వాడొచ్చు. ఈ జెల్ మెమొరీ ఫోమ్ ప్యాడ్స్ ఎలాంటి నొప్పి లేకుండా ఎక్కువసేపు పనిచేసేందుకు ఉపయోగపడతాయి. ఇవి చేతికి చక్కని సపోర్ట్ ఇస్తాయి. టైప్ చేసేటప్పుడు, మౌస్ వాడేటప్పుడు చేతిని ఒకే పొజిషన్లో ఉంచుతాయి. దీంతో కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. వాడేటప్పుడు చేతికి గాలి తగిలేలా డిజైన్ చేశారు. ప్యాడ్ కింద ఉన్న నాన్-స్కిడ్ రబ్బర్ బేస్.. ప్యాడ్స్ జారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఎక్కువసేపు టైప్ చేసే ఉద్యోగులు, గేమర్స్, రైటర్లు, ఎడిటర్లకు ఇది చాలా ఉపయోగకరం. చేతి నొప్పికి చక్కని ఉపశమనం. ఈ ప్యాడ్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కీబోర్డ్ కోసం, రెండోది మౌస్ కోసం. వీటి పరిమాణం అన్ని కంప్యూటర్లకు సరిపోతాయి.