సంగీత సాహిత్యాలు సరస్వతీ స్తనద్వయమని అలంకారికుల మాట. కానీ సి.నారాయణరెడ్డికి అవి రెండు కళ్లు. రెండిటిపైనా ఆయనకు అపారమైన ప్రేమ, ఆసక్తి. ఆయన కవిత్వం,సినీ గీతాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జున సాగరం’
కావ్యాల సాహితీమూలాలు, ఆధునిక తెలుగు సాహిత్యంలో వాటి స్థానం తెలిసిందే.అద్భుతమైన గాన యోగ్యత కలిగిన కవ్వాలీలను
ముట్టుకుంటే… ‘సంగీత సాహిత్య’ సమాహార శైలి అనుభూతిలోకి వస్తుంది.సినిమాల్లోనూ ఈ కోవలో అనేక గీతాలు రాశారు సినారె. వాటిలో
‘స్వాతి కిరణం’ (1992) కోసం ఆయన రాసిన ‘సంగీత సాహిత్య సమలంకృతే’ గీతాన్ని మనసారా స్మరించుకుందాం.
కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతి కిరణం’ సినిమా పూర్తిగా సంగీతం, కళాకారులు, వారి నేపథ్యాలు, మనస్తత్వాలు ఇతివృత్తంగా తెరకెక్కింది. ఈ సినిమా కోసం సినారె మూడు గీతాలను రాశారు. ‘శృతి నీవు.. గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ’, ‘సంగీత సాహిత్య సమలంకృతే’, ‘ప్రణతి ప్రణతి ప్రణతి.. ప్రణవనాద జగతికి’.. ఈ మూడు పాటలూ వేటికవే మేటి గీతాలు. సంగీత సాహిత్య కేతనాలు. భారతీయ ఆధ్యాత్మిక సంపదకు నిదర్శనాలు.
పల్లవి
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభూషితే
హే భారతీ.. మనసా స్మరామి
శ్రీ భారతీ.. శిరసా నమామి
చరణం 1
వేద వేదాంత వనవాసినీ.. పూర్ణ శశిహాసినీ
నాదనాదాంత పరివేషిణీ.. ఆత్మ సంభాషిణీ ॥2॥
వ్యాసవాల్మీకి వాగ్దాయినీ ॥2॥
జ్ఞానవల్లీ సముల్లాసినీ…
చరణం 2
బ్రహ్మరసనాగ్ర సంచారిణీ.. భవ్య ఫలకారిణీ
నిత్య చైతన్య నిజరూపిణీ.. సత్య సందీపినీ ॥2॥
సకల సుకళా సమున్మేషిణీ ॥2॥
సర్వరసభావ సంజీవినీ…
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభాషితే
సినారె బహుభాషా కోవిధులు, తెలుగు, ఉర్దూ, ఆంగ్లంతో పాటు సంస్కృత భాషలోనూ పాండిత్యం ఆయన సొంతం. ‘స్వాతి కిరణం’లోని సింహభాగం పాటలు సంస్కృత సమాసభరతమై వినిపిస్తాయి. ఈ సినిమా కథావస్తువు గురుశిష్య సంబంధం. గురువు శాస్త్రీయ సంగీతజ్ఞుడు. తన శిష్యుడి అసమాన ప్రతిభను మెచ్చుకుని, ముగ్ధుడు కాకపోగా.. అసూయాపరుడై ఆ చిరంజీవి మరణానికి కారణం అవుతాడు. చివరికి పశ్చాత్తాపం చెందుతాడు. ఇక ‘సంగీత సాహిత్య సమలంకృతే’ విషయానికి వస్తే గురువు తాళపత్రాల్లో ఉన్న ఒక ప్రాచీన కృతిని స్వరపరుస్తున్న సన్నివేశం కోసం ఈ గీతాన్ని కూర్చగా. దీనిని ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గానం చేశారు. కె.వి. మహదేవన్ ‘ఖరహర ప్రియ’ రాగంలో దీనిని స్వరపరిచారు.
ఈ గీతాన్ని పరిశీలిస్తే వాగ్దేవి, వాగ్దాయినీ అయిన సరస్వతీ దేవిని స్తుతిస్తూ చెప్పిన స్తోత్రంలాగా కనిపిస్తుంది. భారతీయుల ప్రకారం సరస్వతీ దేవి సంగీత సాహిత్యాలకు అధిదేవత. అందుకే ‘సంగీత సాహిత్య సమలంకృతే’ అంటూ తన కృతిని ప్రారంభించారు కవి. అటు సంగీత పరంగా, ఇటు సాహిత్య పరంగా సమానమైన వర్ణనలతో ఈ గీతంలోని చరణాలను కూర్చారు. పల్లవి మొదలుకుని ప్రతి చరణంలో అది కనిపిస్తుంది. కథ పరంగా సినిమాలో అనంతరామశర్మ (మమ్ముట్టి) ఒక ప్రాచీన కృతిని స్వరపరచాల్సి వస్తుంది. అందుకే సినారె సంస్కృత పదాలతో ఈ పాటను రాశారు.
స్వరరాగ పదయోగ సమభూషిత అయిన వాగ్దేవిని ‘హే భారతి మనసా స్మరామి/ శ్రీ భారతి శిరసా నమామి’ అంటూ వాగ్దేవిని సంగీతాధిదేవతగా స్తుతిస్తూనే, వెంటనే ‘వేద వేదాంత వనవాసినీ’ అంటూ సాహిత్య పరంగా కీర్తిస్తారు. వేదాలు.. భారతీయ సాహిత్య సంస్కృతులకు తొలి ఆనవాళ్లు, భారతీయ జీవన మూలాలకు పతాకలు! ఆ తర్వాతి పంక్తుల్లో ‘నాద నాదాంత పరివేషిణీ’ అంటూ సంగీతాత్మకం చేస్తారు. వేదాంత పదానికి సరితూగేట్టు నాదాంతం అనే ప్రయోగం చేశారు సినారె. ‘బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్యఫలకారిణీ/ నిత్య చైతన్య నిజరూపిణీ సత్య సందీపినీ’ అన్న చరణంలో సరస్వతీ దేవి బ్రహ్మ నాలుకపైన నివసిస్తుందని అన్నదానిని ప్రతీకగా చెబుతారు కవి. భవ్యఫలం అనేది కైవల్య పదం అని కవి భావన. ముగింపులో ‘సకల సుకళా సమున్మేషిణీ / సర్వరసభావ సంజీవినీ…’ అంటూ వాగ్దేవిని సకల కళా సమున్మేషిణిగా వర్ణిస్తారు కవి. ఆహా! చదువుల తల్లికి ఇంతటి గొప్ప కృతి చదివించిన సినారె పుంభావ సరస్వతే అనిపిస్తారు.
-పత్తిపాక మోహన్