Home Sales | దేశంలోని ఏడు ప్రధాన నగరాలతో పోలిస్తే ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో గతేడాదితో పోలిస్తే 2024లో సగటున 30 శాతం ఇండ్ల ధరలు పెరిగాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ పేర్కొంది. ఢిల్లీలో 2023లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) రూ.5,800 పలికితే, 2024లో రూ.7,550లకు చేరుకుంది. భూమి ధర, కార్మికుల వేతనాలు, భవన నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో ఇండ్ల ధరలు వృద్ధి చెందాయి. అనరాక్ అధ్యయనం ప్రకారం 2023లో 65,625 ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో 61,900 ఇండ్ల అమ్మకాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే గతేడాది ఇండ్ల విక్రయాలు ఆరు శాతం తగ్గాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 2023లో 36,735 ఇండ్లు విక్రయిస్తే 2024లో 53,000 ఇండ్ల విక్రయాలు జరిగాయి.
దేశవ్యాప్తంగా ఏడు నగరాల పరిధిలో ఇండ్ల ధరలు సగటున 13-30 శాతం పెరిగాయని అనరాక్ నివేదిక వెల్లడించింది. రెసిడెన్షియల్ ఇండ్ల ధరలు సగటున 21 శాతం వృద్ధి చెందాయి. 2023లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) రూ. 7080 నుంచి 2024లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) రూ.8,590లకు పెరిగింది. ఈ ఏడాది ఇండ్ల ధరలు స్థిరంగా ఉంటాయని భావిస్తున్నట్లు అనకరాక్ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. గతేడాది ఎన్నికల ప్రక్రియ వల్ల ఇండ్ల విక్రయాలు నెమ్మదించి ఉండవచ్చునని పేర్కొన్నారు.