Delhi Airport – Fog | దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచుతో దృశ్య గోచరత తగ్గిపోవడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరుసగా రెండో శనివారం 19 విమాన సర్వీసులు దారి మళ్లించగా, పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. 400కి పైగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శనివారం తెల్లవారుజామున 12.15 గంటల నుంచి 1.30 గంటల వరకూ 19 విమాన సర్వీసులు దారి మళ్లించామని ఢిల్లీ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు. వాటిలో 13 దేశీయ సర్వీసులు, నాలుగు అంతర్జాతీయ విమానాలు, మరో రెండు నాన్ షెడ్యూల్ విమానాలు ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా నడిచే 45కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించారు.
ఫ్లైట్ రాడార్24 డాట్ కాం ప్రకారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 400 పై చిలుకు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో తెల్లవారుజామున విమానాల ఎరైవల్స్, డిపార్చర్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. దట్టమైన పొగ మంచు వల్ల ఢిల్లీతోపాటు ఉత్తర భారతంలోని పలు నగరాల పరిధిలో విమాన సర్వీసులపై ప్రభావం చూపిందని ఎయిర్ ఇండియా తెలిపింది.
శుక్రవారం కూడా దట్టమైన పొగ మంచు వల్ల ఢిల్లీతోపాటు చండీగఢ్, అమృత్సర్, శ్రీనగర్, గువాహటి, పాట్నా పరిధిలో పగటి వేళల్లో కూడా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఢిల్లీ విమానాశ్రయ సంస్థ తెలిపింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ రోజూ సుమారు 1300 విమాన సర్వీసులు నడుపుతోంది.