హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపలికి తరలించాలన్న ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రత్యామ్నాయ స్థలాలు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించడంతో పరిశ్రమల తరలింపు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే నగరంలోని పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తామని ప్రకటించినా, కానీ అడుగు కూడా ముందుకు కదల్లేదు. గతంలో శివారు ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు నగర విస్తరణ వల్ల జనావాసాలు పెరిగిపోయి ఇప్పుడు కాలనీల మధ్యలోకి చేరినైట్టెంది. దీంతో కాలుష్య సమస్య ఏర్పడుతుండగా, సదరు పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి దశలవారీగా తరలించాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పరిశ్రమల తరలింపునకు ఔటర్ వెలుపల 22 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ భూములను గుర్తించారు. ఇందులో ఉన్న 800 ఫార్మా కంపెనీలను రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మాసిటీకి, అలాగే కాటేదాన్, జీడిమెట్లలోని 35 స్టీల్ కంపెనీలను 150 ఎకరాల విస్తీర్ణంగల వికారాబాద్ జిల్లా రాకంచర్ల ఇండస్ట్రియల్ పార్క్‌కు తరలించాలని నిశ్చయించారు. వంటనూనె పరిశ్రమలను జహీరాబాద్‌లోని బుచినేపల్లి ఇండస్ట్రియల్ పార్క్‌కు, టెక్స్టైల్ పరిశ్రమలను సంగారెడ్డిలోని ఇంద్రేశం ఇండస్ట్రియల్ పార్క్‌కు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిశ్రమలను తరలించే ఆయా పారిశ్రామిక వాడల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.
నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్న పరిశ్రమలను జనావాసాలకు దూరంగా పంపించే ప్రక్రియ రేవంత్ సర్కారు అలసత్వంతో ఆగిపోయింది. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు మొదట ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీంతో ఫార్మా పరిశ్రమలను ఎక్కడికి తరలించాలనేది అంతుబట్టకుండా ఉన్నది. అలాగే ఇతర పరిశ్రమల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే స్థలాలను సిద్ధం చేసినప్పటికీ వాటి తరలింపులో ప్రస్తుత ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫలితంగా కాలుష్య సమస్య నానాటికీ పెరుగుతూపోతున్నది. సమీప కాలనీలవాసులకు ఇది పెను సమస్యగా పరిణమిస్తున్నది. కాగా, ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేసినట్టు టీజీఐఐసీ అధికారులు తెలిపారు. అయితే వివిధ కారణాలతో యజమానులు గడువు కోరుతున్నారని, బలవంతంగా తరలిస్తే లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయనే మౌనం గా ఉంటున్నామన్నారు. కాగా, ప్రభుత్వం నుంచి కూడా తమపై ఎటువంటి ఒత్తిడి లేదని వారు అంటుండటం గమనార్హం.