Rupee | ముంబై, ఫిబ్రవరి 3: డాలర్ ముందు రూపాయి తేలిపోతున్నది.. ఏమాత్రం నిలువలేక చతికిలపడుతున్నది.. అంతకంతకూ బలహీనపడిపోతున్నది. గతకొద్ది రోజులుగా ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ ట్రేడింగ్ తీరుతెన్నులను వివరించే క్రమంలో వాడుతున్న వాక్య నిర్మాణాలివి. అవును.. రూపీ కష్టాలు అన్నీఇన్నీ కావు మరి. అయితే వరుస పతనాల్లో కొట్టుమిట్టాడుతున్న రూపాయికి.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపంలో కొత్త సమస్యలు వచ్చినట్టే కనిపిస్తున్నది. ఇవి ఇలాగే సాగితే రూపీ సెంచరీ కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. సోమవారం మరో 49 పైసలు దిగజారి డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 87 మార్కును దాటేసింది. మునుపెన్నడూ లేనివిధంగా 87.11 వద్ద ముగిసి మరో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సర్కారు విధించిన సుంకాలే దీనికి ప్రధాన కారణం.
ట్రంప్ దెబ్బ
కెనడా, మెక్సికోలపై 25 శాతం చొప్పున సుంకాలు బాదిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. చైనాపై 10 శాతం విధించారు. ఈ నిర్ణయం అమెరికా డాలర్ ఇండెక్స్‌ను ఒక్కసారిగా ఎగదోసింది. 109 స్థాయి ఎగువకు డాలర్ సూచీ వెళ్లింది. ఈ దెబ్బకు రూపాయి కూడా ఒకానొక దశలో 67 పైసలు క్షీణించి 87.29 స్థాయికి పడిపోవడం గమనార్హం. తిరిగి మళ్లీ కోలుకున్నా.. నష్ట తీవ్రత మాత్రం పెద్దగానే జరిగింది. ఆయా దేశాలపై సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చన్న భయాలు ఫారెక్స్ మార్కెట్‌ను చుట్టుముట్టాయి. దీంతో దేశీయ దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లకు పెద్దపీట వేశారని ట్రేడర్లు చెప్తున్నారు. ఇక విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారత మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటుండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మరింతగా బలహీనపరుస్తున్నది. మరో రూ.3,958.37 కోట్లు ఉపసంహరించుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలూ రూపీ ఉసురుతీశాయి.
భయపడొద్దు.. ఆర్బీఐ ఉందిలే: పాండే
రూపాయి రికార్డు నష్టం నేపథ్యంలో విలేకరుల వద్ద కేంద్ర ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత పాండే స్పందిస్తూ.. ‘భయం అక్కర్లేదు ఈ ఒడిదొడుకులను ఆర్బీఐ చూసుకుంటుందిలే’ అన్నారు. అలాగే భారతీయ కరెన్సీ స్వేచ్ఛగా ట్రేడ్ అవుతుందని, దాన్ని అదుపు చేయడం లేదా ఒక స్థిరమైన రేటును నిర్ణయించడం అనేది ఉండబోవని కూడా చెప్పారు. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి తరలిపోతున్న విదేశీ పెట్టుబడుల నడుమ రూపాయి మారకం విలువ ఒత్తిళ్లకు గురువుతుందన్న ఆయన.. ఈ ఒడిదొడుకులను ఆర్బీఐ సరిచేస్తుందన్న ధీమాను కనబర్చారు. ఇక డిసెంబర్ 31న 85.61 వద్ద ముగిసిన రూపీ విలువ.. ఇప్పుడు 87.11 వద్దకు చేరింది. కేవలం గడిచిన నెల రోజుల్లోనే రూపాయిన్నర క్షీణించింది.