TRAI-Supreme Court | ఒకరు తీసుకున్న మొబైల్ ఫోన్ నంబర్లు వారు రద్దు చేసుకున్న 90 రోజుల తర్వాతే ఇతరులకు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది. వ్యక్తిగత డేటా గోప్యతను ద్రుష్టిలో పెట్టుకుని కొత్త వారికి మొబైల్ ఫోన్ నంబర్లకు కేటాయించడంలో తీసుకుంటున్న జాగ్రత్తలను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ట్రాయ్ వివరించింది. రద్దు చేసిన, డీయాక్టివేట్ మొబైల్ నంబర్ల విషయమై దాఖలైన పిటిషన్‌పై విచారణలో ట్రాయ్ ఈ సంగతి తెలిసింది.
పలువురు వ్యక్తులు తమ ఫోన్ నంబర్లకు వాడకుండా వదిలేయడంతో కొన్ని రోజుల తర్వాత డీయాక్టివేట్ అవుతాయి. మరికొందరు ఎక్కువ ఫోన్ నంబర్లు ఉంటే.. కొన్ని నంబర్లు రద్దు చేసుకుంటారు. అలా రద్దయిన, డీయాక్టీవేట్ అయిన ఫోన్ నంబర్లను టెలికం సంస్థలు కొన్ని రోజుల తర్వాత ఇతరులకు కేటాయిస్తున్నాయి. దీనివల్ల వ్యక్తుల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నదని పేర్కొంటూ 2021లో రిట్ పిటిషన్ దాఖలైంది. వాట్సాప్ ఖాతా సమాచారంతోపాటు సదరు వ్యక్తుల పర్సనల్ సమాచారం ప్రమాదంలో పడుతుందని పిటిషనర్ వాదించారు.
ఫోన్ నంబర్ల రీసైక్లింగ్ విషయమై దాఖలైన పిటిషన్ మీద జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎస్ భట్టిలతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ట్రాయ్ తన వైఖరిని న్యాయస్థానానికి తెలిపింది. అంతకుముందు మొబైల్ నంబర్ వినియోగదారుడి డేటా గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు నెలల గడువు తీసుకుంటున్నామని ట్రాయ్ పేర్కొంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కూడా ఇతరుల డేటా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపింది. వాట్సాప్ అకౌంట్ యాక్టివిటీ పరిశీలిస్తామని, 45 రోజుల కంటే ఇన్-యాక్టివ్ మోడ్ లో ఉండి.. కొత్త డివైజ్ లో యాక్టివేట్ అయితే.. అందులో డేటా పూర్తిగా తొలగిపోతుందని పేర్కొంది.