Airtel | న్యూఢిల్లీ, జనవరి 22: టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లలో మార్పులు చేసింది. రూ.509, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్లలో డాటా ఆఫర్ను ఎత్తివేసింది. ప్రస్తుతం అత్యధిక ప్రీపెయిడ్ ప్లాన్లు డాటాతోపాటు వాయిస్, ఎస్ఎంఎస్ కలుపుకొని ఆఫర్ చేస్తున్నాయి. టెలికం సంస్థలు ప్రత్యేకంగా వాయిస్ లేదా ఎస్ఎంఎస్ సర్వీసులు అందించే ప్లాన్లను ప్రవేశపెట్టాలని ట్రాయ్ సూచించిన విషయం తెలిసిందే. దీంతో ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 84 రోజుల కాలపరిమితితో రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్లో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఎస్ఎంఎస్లు అందిస్తున్నది. అలాగే రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్ కింద 3 వేల ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తున్న ఈ ప్లాన్ కాలపరిమితి ఏడాది.
హెచ్యూఎల్ లాభం 2,989 కోట్లు
న్యూఢిల్లీ, జనవరి 22: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,989 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,508 కోట్లతో పోలిస్తే 19.18 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.16,050 కోట్లకు చేరుకున్నది.