Investers Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండు రోజుల్లో మదుపర్ల సంపద రూ.10.47 లక్షల కోట్లు వృద్ధి చెందింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ రెండు శాతం పుంజుకున్నది. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో మదుపర్ల సంపదగా భావిస్తున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,47,565.48 లక్షల కోట్లు వృద్ధి చెంది రూ.4,52,58,633.53 కోట్ల (5.37 లక్షల కోట్ల డాలర్లు) కు చేరుకున్నది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ఫీల్ గుడ్ భావన కొనసాగింది. ఫలితంగా ఐటీ స్టాక్స్‌తోపాటు దేశీయ ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ తిరిగి 80 వేల మార్క్‌ను దాటింది. ఈ దఫా ట్రంప్ పాలనలో హెచ్-1 బీ వీసా నిబంధనల్లో మార్పులు ఉండచకపోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నాలుగు శాతానికి పైగా వృద్ధి చెందాయి. వీటితోపాటు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, లార్సన్ అండ్ టర్బో, మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ముగిశాయి. మరోవైపు టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాలను చవి చూశాయి.
అన్ని రకాల సెక్టోరల్ ఇండెక్సులు లాభాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 4.04 శాతం, టెక్ 3.37 శాతం, రియాల్టీ 2.68 శాతం, ఇండస్ట్రీయల్స్ 2.66 శాతం, సర్వీసెస్ 2.53 శాతం, యుటిలిటీస్ 2.44 శాతం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-30లో 3,000 స్టాక్స్ లాభాలు గడిస్తే, 968 షేర్లు నష్టాలతో ముగిశాయి. మరో 95 షేర్లు ఫ్లాట్ గా స్థిర పడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.28 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.96 శాతం పుంజుకున్నాయి.