Cyrus Mistry | రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ( Cyrus Mistry ) హఠాన్మరణం పాలైన ఘటనతో రాజకీయ, వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతోపాటు దేశమంతా విషాదం మిగిల్చింది. ఆయన మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీతోపాటు ప్రముఖ రాజకీయ, పారిశ్రామికవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రమాద ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు అందుకు కారణాలు నిర్ధారించారు. మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారును ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోలే (55) నడిపారని పోలీసులు చెప్పారు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వస్తున్న మిస్ట్రీ కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న పండోలే అతివేగంగా నడుపుతున్నారని, రాంగ్ సైడ్ నుంచి మరో కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించడంతోనే ప్రమాదం సంభవించిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో కారు 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్‌తో వస్తున్నదన్నారు.
ముందు సీట్లో కూర్చున్న అనహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే గాయాలతో బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ మరణించారని పోలీసులు తెలిపారు. ఈ కారును ఒక మహిళ నడిపారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఎడమ వైపు నుంచి కారు ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారన్నారు. వెంటనే సాయం అందడంలో ఇద్దరు వ్యక్తుల్ని కారు నుంచి బయటకు లాగి, అంబులెన్స్‌లో దవాఖానకు తరలించామని. కానీ ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారని చెప్పారు.
సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదంపై డీజీపీతో మాట్లాడానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. సైరస్ మిస్త్రీ అకాల మరణం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించానన్నారు.