హైదరాబాద్, ఏప్రిల్ 25: హైదరాబాదీ ఐటీ సంస్థ సైయంట్ ఒక అంతర్జాతీయ సంస్థను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఫిన్లాండ్కు చెందిన ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ సిటెక్‌ను రూ. 800 కోట్లకు టేకోవర్ చేస్తున్నామని సైయంట్ సోమవారం తెలిపింది. 1984లో స్థాపితమైన ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ సిటెక్ విద్యుత్, గనుల తవ్వకం, ప్రాసెస్, ఆయిల్ గ్యాస్, తయారీ పరిశ్రమల్లో కస్టమర్లకు సేవలందిస్తున్నది. ఈ కంపెనీలో అంతర్జాతీయంగా 1200 మంది ఉద్యోగులున్నారు. తమ ఇప్పటివరకూ చేసిన టేకోవర్లలో ఇదే పెద్దదని, అలాగే భారత్‌లోని ఇంజనీరింగ్ సర్వీసుల కంపెనీ..విదేశాల్లో ఇంత భారీ కొనుగోలు జరపడం ఇదే ప్రధమమని సైయంట్ వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందన్నది. తాజా టేకోవర్‌తో ప్లాంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్ రంగంలో తాము అగ్రస్థానంలోకి చేరతామని, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర యూరప్ దేశాల్లో విస్తరిస్తామని సైయంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కృష్ణ బోడనపు తెలిపారు. 2021లో సిటెక్ రూ. 660 కోట్ల ఆదాయా న్ని ఆర్జించింది. సైయంట్ ద్వారా తాము కస్టమర్లకు మరింత సమగ్రమైన సర్వీసులు, సొల్యూషన్లు అందిస్తామని సిటెక్ సీఈవో జాన్ వెస్టర్మరక్ పేర్కొన్నారు.