న్యూఢిల్లీ, మార్చి 28: ఆరోగ్య సంరక్షణ, పవర్ గ్రిడ్ల వంటి కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇటీవలకాలంలో సైబర్ దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి కేవలం డాటాను దొంగలించడానికి మాత్రమే పరిమితం కాలేదని, మానవుల ప్రాణాలకు ముప్పు కలిగించే స్థాయికి చేరుకున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశంలో డిజిటల్ పురోగతి అనే అంశంపై డెలాయిట్ ప్రతినిధి గౌరవ్ శుక్లా మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతోఈ దాడుల అవకాశాలను మరింత పెంచాయని, తద్వారా విమానయానం, రవాణా, ప్రజా సేవల రంగాలకు ముప్పుగా పరిణమించనున్నాయన్నారు. గత రెండేండ్లుగా సైబర్ దాడులు కేవలం ఐటీ వ్యవస్థలకు మాత్రమే పరిమితం కాలేదని, ఈ పరిధి దాటి వ్యాపిస్తున్నాయి.
కీలక మౌలిక సదుపాయాలను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా డిజిటల్ సాంకేతికతో వచ్చిన మార్పులు ఈ దాడుల విస్తృతిని మరింత పెంచాయని ఆయన పేర్కొన్నారు. దీంతో అంతరాయాలు కలిగే అవకాశాలు అధికమవుతున్నాయి. వీటి పరిధి డాటా భద్రత నుంచి మానవ భద్రత వైపు మారుతున్నదని స్పష్టమవుతున్నదని ఆయన పేర్కొన్నారు.
మీరు ఒక జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా మీ కారు స్టీరింగ్ మీ చేతి కంట్రోల్ నుంచి తప్పిపోయినప్పుడు. .మీ బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందో గుర్తుకు రాదు కానీ..మీ జీవితం ప్రమాదంలో ఉన్నదనే ఆందోళన నెలకొంటుందన్నారు. కానీ, ప్రస్తుతం సైబర్‌సెక్యూరిటీ డాటా సెక్యూరిటీ నుంచి మానవ భద్రతగా మారుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.