Cyber Insurance | వ్యక్తిగత డేటా ఎంతో విలువైనది. పలువురు నెటిజన్లు.. తమ ఫోన్లు, కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లో కీలకమైన డేటా దాచుకుంటారు. అనూహ్య పరిస్థితుల్లో మన డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నది. దీనివల్ల ఆర్థిక పరమైన సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇటువంటి కష్టాలొచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం తప్పనిసరిగా మారుతున్నది.
రోజురోజుకు కొత్త టెక్నాలజీ పెరుగుతున్నది. తదనుగుణంగా సైబర్ మోసగాళ్లు సరికొత్త టెక్నిక్‌లు, మోసాలతో దోచుకుంటున్నారు. ఈ తరుణంలో ఫోన్లు, కంప్యూటర్లకు ప్రొటెక్షన్ కల్పించే సాఫ్ట్ వేర్ వాడాలి. దాంతోపాటు ఒక సైబర్ బీమా పాలసీ కూడా తీసుకోవాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ రూ. లక్ష నుంచి రూ.కోటి విలువ గల బీమా పాలసీ కొనుగోలు చేయొచ్చు. ఈ పాలసీ తీసుకునే సమయంలో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడినప్పుడు గానీ, యూపీఐ లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు జరిగే ఫ్రాడ్లకు సైబర్ సెక్యూరిటీ కవరేజీ లభిస్తుందా? అన్న సంగతి తెలుసుకున్నాకే బీమా పాలసీ ఖరారు చేసుకోవాలి. ప్రతి రోజూ మన ఫోన్లకు కేవైసీ నిబంధనలు పూర్తిగా పాటించలేదు కనుక మీ బ్యాంక్ ఖాతా లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు బ్లాక్ చేశామనే మెసేజ్‌లు వస్తాయి. ఈ-మెయిల్లో వచ్చిన లింక్‌లు ఫ్రాడ్ లింక్లైతే.. వాటిని ఓపెన్ చేసినప్పుడు మీ బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు నుంచి డబ్బు మాయం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక నష్టం భర్తీ చేసేలా సదరు బీమా పాలసీ ఉండాలి.
సైబర్ మోసగాళ్లు ఫోన్లు, కంప్యూటర్లను హ్యాక్ చేయగలరు. అలా హ్యాక్ చేసి వాటిల్లో భద్రపరిచిన వ్యక్తిగత డేటా తస్కరించి చేసే మోసాల నుంచి రక్షణ కల్పించేలా బీమా పాలసీ ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తి ఆధార్ లేదా పాన్ కార్డు డిటైల్స్ సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేయడం వల్ల జరిగే నష్టాన్ని భరించే వెసులుబాటు గల పాలసీలు ఉన్నాయా? అనే విషయం.. పాలసీ కొనుగోలు చేసే ముందే చెక్ చేసుకోవాలి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి కూడా మన డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించే అవకాశాలు ఉన్నాయి. అలా తీసుకున్న డేటాతో చేసే మోసాల నుంచి సెక్యూరిటీ కోసం పెట్టే ఖర్చులు కూడా భరించేలా బీమా పాలసీ ఉండాలి. వ్యక్తిగత వేధింపుల నుంచి రక్షణకు పెట్టే ఖర్చులకు కూడా పరిహారం పొందడానికి వెసులుబాటు ఉండాలి.
మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా ఫోన్లు, కంప్యూటర్లలోకి సైబర్ మోసగాళ్లు మాల్వేర్ పంపుతారు. అలా పంపిన మాల్వేర్.. మన కంప్యూటర్లు, ఫోన్ల ఉంచి డేటాను సైబర్ మాయగాళ్లు పొందడం తేలికవుతుంది. ఈ మాల్వేర్ సాయంతో ముఖ్యంగా పేర్లు, పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాలను సైబర్ మోసగాళ్లు సేకరించి డబ్బు మళ్లిస్తారు. ఇటువంటి సందర్భాల్లో జరిగే నష్టాలను కూడా బీమా పాలసీ భరిస్తుంది. మాల్వేర్ దాడి జరిగినప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్, డేటా పునరుద్ధరణకు అయ్యే ఖర్చులు కూడా సైబర్ బీమా పాలసీ చెల్లిస్తుంది.
అంతే కాదు.. ఫోన్లు, కంప్యూటర్లలో భద్రపరుచుకునే మీ పర్సనల్ ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంతో తలెత్తే పరిణామాలకు ఈ సైబర్ బీమా పాలసీ వల్ల పరిహారం పొందొచ్చునని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు. సైబర్ మోసగాళ్ల వల్ల కలిగే మానసిక ఆరోగ్యచికిత్సలకూ అయిన ఖర్చు కూడా సైబర్ బీమా పాలసీ ద్వారా పొందొచ్చునని వారు అంటున్నారు.