RBI | ముంబై, డిసెంబర్ 30: దేశంలో సైబర్ మోసాలు పెరిగాయి. డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదికే ఇందుకు నిదర్శనం. డిసెంబర్ నెలకుగాను ఆర్థిక సుస్థిరత నివేదిక (ఎఫ్ఎస్ఆర్) పేరిట సోమవారం ఆర్బీఐ రిపోర్టు విడుదల చేసింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్) 18,461 సైబర్ మోసాలు జరిగాయని, వీటి విలువ రూ.21,367 కోట్లని తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే వ్యవధిలో 14,480 కేసులు నమోదయ్యాయని, వాటి విలువ కేవలం 2,623 కోట్లేనన్నది. ఈ క్రమంలోనే సైబర్ మోసాల గురించి అందరిలోనూ అవగాహన పెరగాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది. అంతేగాక మనీ లాండరింగ్‌కు దారితీసే మ్యూల్ అకౌంట్స్‌ను గుర్తించడం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నది. కాగా, సైబర్ మోసాల బారినపడ్డ బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారని, మానసికంగా కూడా తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని ఆర్బీఐ ఈ సందర్భంగా ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.
ఈసారి జీడీపీ 6.6 శాతం
ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ ఈ సందర్భంగా అంచనా వేసింది. వచ్చే ఏడాది ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశాలే ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ల్లో లబ్ధిదారు పేరు
వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ వ్యవస్థలైన నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్)ల్లో వినియోగదారులకు లబ్ధిదారు పేరు కనిపించే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించనున్నాయి. ఈ మేరకు సోమవారం ఆర్బీఐ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ఇమ్మీడియేట్ పేమెంట్స్ సర్వీస్ (ఐఎంపీఎస్) సిస్టమ్స్ల్లోనే ఈ తరహా సౌకర్యం ఉన్నది. నగదు పంపించేవారు ఎవరికైతే పంపిస్తున్నామో వారి పేరును నగదు బదిలీకి ముందే పరిశీలించుకోవచ్చు. దీంతో ఏప్రిల్ 1 నుంచి నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా నగదు బదిలీ చేసేవారికీ ఈ అవకాశం రానున్నది.