న్యూఢిల్లీ, అక్టోబర్ 23: నవంబర్ 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులు.. తమ ఖాతాల్లో నలుగురిదాకా నామినీలను ఎంచుకోవచ్చు. ఈ మేరకు బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం 2025 కింద నామినేషన్‌కు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బ్యాంక్ ఖాతాల కోసం లబ్ధిదారుల పేరును చేర్చే ఈ విధానంలో రెండు పద్ధతుల (సైమల్టేనియస్, సక్సెసివ్ నామినేషన్స్)ను అనుసరించవచ్చు. దీంతో ఖాతాదారుల మరణానంతరం నామినీలకు ప్రయోజనాలను తదనుగుణంగా బ్యాంకులు అందిస్తాయి. ఇదిలావుంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రభావవంతమైన క్లెయిమ్‌ల సెటిల్మెంట్కు ఇది దోహదం చేయగలదని అంటున్నారు. డిపాజిటర్లు తమ తదనంతరం ఒక్కో నామినీకి ఎంతెంత? రావాలన్నది కూడా నిర్ణయించవచ్చునని చెప్తున్నారు.