హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగం గా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ కే రామకృష్ణారావు పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం పరిశ్రమలశాఖ అధికారులు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఆస్తకి చూపుతున్నారని, ఇందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఒప్పందాలతోపాటు పెట్టుబడిదారులకు అవసరమైన ఇతర మౌలిక వసతులను సమకూర్చాలన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫార్మా రంగం, చేనేత ఉత్పత్తులు, టెక్స్టైల్ పారులు, డాటా సెంటర్లు, డ్రైపోర్టులు సంబంధిత రంగాల్లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.