IT Lens on Crypto Investers | క్రిప్టో కరెన్సీలు.. చట్టబద్ధత లేని లావాదేవీలు.. బ్యాంకుల నుంచి క్రిప్టో లావాదేవీల కోసం నిధులను మళ్లించిన ఇన్వెస్టర్లపై ఆదాయం పన్నుశాఖ అధికారుల కన్ను పడింది. అధిక మొత్తంలో లావాదేవీలు జరిపే సుమారు 700 మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. ఈ జాబితాలో ఏనాడూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని భార్యలు, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. వారిలో కొందరు తమ ఐటీ రిటర్న్స్‌లో ఆ లావాదేవీల వివరాలేమీ పేర్కొనలేదు.వర్చువల్ డిజిటల్ ఆస్తుల్లో పెట్టుబడులతో పొందిన లాభాల ఊసే సదరు ఇన్వెస్టర్లు ప్రస్తావించలేదు. మరికొందరు ఏ వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడు వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు ఐటీ శాఖ సిద్ధం అవుతున్నది.
ఆ జాబితాలో సంపన్నులు, ఎన్నారైలు, సంస్థలు, స్టార్టప్‌ల యాజమాన్యాలు కూడా ఉన్నాయి.క్రిప్టో లావాదేవీలతో వీరు పొందిన లాభాలు రూ.40 లక్షల పై చిలుకేనని ఐటీ అధికారులు అంటున్నారు. సకాలంలో వివరాలు ఇవ్వనందుకు వారి నుంచి 30 శాతం పన్ను, పెనాల్టీతోపాటు వడ్డీ వసూలు చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు జరిపిన వారి జాబితాను ఐటీ అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు సిద్ధం చేసిన జాబితాలో 700 మంది పేర్లు ఉన్నాయి. వారు చెల్లించాల్సిన పన్ను చాలా ఎక్కువగా ఉంటుంది అని ఆ సీబీడీటీ అధికారి చెప్పారు. క్రిప్టో లావాదేవీలు జరిపిన వ్యక్తుల పేర్లు, వారు ఎలా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.