న్యూఢిల్లీ, జూన్ 15: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించుతూ గల్ఫ్ వార్ ముగింపునకు అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి రావడం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు 4.7 శాతం పతనమై 84 డాలర్లకు దిగువన 83.24 డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన ఈ యుద్ధం.. మూడున్నర నెలలు కొనసాగింది. ఈ నేపథ్యంలో క్రూడ్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైంది. ఒకానొక దశలో బ్యారెల్ ధర 125 డాలర్లను తాకింది. అమెరికాకు అండగా ఉంటున్నాయని, పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలపై ఇరాన్ దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాల్లో ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడింది. మరోవైపు చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడం కూడా పరిస్థితుల్ని మరింతగా దిగజార్చింది.
ఇంకా తగ్గాలి..
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలకు ముందు బ్యారెల్ ముడి చమురు ధర దాదాపు 70 డాలర్ల వద్ద ఉన్నది. దీన్నిబట్టి ఇప్పుడున్న రేటును చూస్తే.. ఇంకా 14-15 డాలర్లు తగ్గాల్సిన అవసరం ఉన్నది. అయితే చమురు ధరలు మున్ముందు తగ్గుముఖం పడుతాయని చెప్పలేని దుస్థితి. గడిచిన మూడున్నర నెలల్లో ఉద్రిక్తతలు ఇలాగే తగ్గి.. మళ్లీ పెరిగిన సందర్భాలున్నాయి మరి. అందుకే ఇప్పుడు అమెరికా-ఇరాన్ నడుమ కుదిరిన ఈ ఏకాభిప్రాయం కార్యరూపం దాల్చేదాకా నమ్మలేమని మార్కెట్ నిపుణులు సందేహపడుతుండటం గమనార్హం. ట్రంప్ నిలకడలేని విధానాలు, ఇజ్రాయెల్ దుందుడుకు నిర్ణయాలతో.. పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలూ ఇంకొందరి నుంచి వ్యక్తమవుతుండటం గమనించదగ్గ అంశమే. ఇదిలావుంటే ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఇరు దేశాల వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఈ 3-4 రోజులు ఏం జరుగుతుందా? అన్నదానిపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తున్నది.
హొర్ముజ్ తెరుచుకున్నా..
హొర్ముజ్ జలసంధిని మళ్లీ తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. భారత్‌కు ఇది గొప్ప ఊరటగానే చెప్పవచ్చు. అయితే వార్ ముగిసినా, హొర్ముజ్ జలసంధిలో రవాణాకు మార్గం సుగమమైనా.. మునుపటిలా సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనబోవని, అందుకు చాలా సమయమే పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ ఉత్పాదక కేంద్రాలకు భారీగానే నష్టం వాటిల్లింది. దీంతో యుద్ధానికి ముందున్న స్థాయిలో ఇప్పుడు వాటి నుంచి ఉత్పత్తి కష్టమేనంటున్నారు. అలాగే పర్షియన్ గల్ఫ్‌లో వార్ దెబ్బకు ఆగిన చమురు, గ్యాస్ నౌకలు.. వాటి గమ్యస్థానాలకు చేరుకోవడానికి కూడా సమయం పడుతుందని గుర్తుచేస్తున్నారు. ఫలితంగా ఇప్పట్లో భారతీయ రిటైల్ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గడం ఉండదని స్పష్టం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజీల్ ధరలు లీటర్‌కు దాదాపు రూ.8 చొప్పున పెరిగిన సంగతి విదితమే. అలాగే 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్ రేటు కూడా రూ.90 ఎగిసింది. సీఎన్జీ, విమానయాన ఇంధనం, వాణిజ్య సిలిండర్ల ధరలూ ఎగబాకాయి.