Co-Branded Credit Card | గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. బ్యాంకులు సైతం తమ వ్యాపారం పెంచుకోవడానికి తేలిగ్గా క్రెడిట్ కార్డులు జారీ చేస్తు్న్నాయి. అలా జారీ చేసిన క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు తదితర బెనిఫిట్లు కల్పిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డుల వాడకం దారులు ఎక్కువయ్యారు. ఇక ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.
మార్కెట్లో పరిస్థితులు, కస్టమర్ల అవసరాలను బట్టి పలు క్రెడిట్ కార్డులు వస్తు్న్నాయి. సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో అదనపు బెనిఫిట్లు ఉన్నాయి. కొన్ని బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైల్ వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు.. బ్యాంకులతో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో తమ అనుబంధ బ్రాండ్లలో జరిపే ట్రాన్సాక్షన్స్ పెంచుకోవడానికి ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ అందిస్తున్నాయి. మీ కుటుంబ అలవాట్లకు సరిపడా బెనిఫిట్లు కల్పించే కార్డు ఉపయోగించుకుంటే సాధారణ క్రెడిట్ కార్డు కంటే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుకే అదనపు రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.
కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపే వారు.. వాటి వాడకంలో సంబంధిత సంస్థలు లేదా బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటే వార్షిక ఫీజు రాయితీ.. తదనుగుణంగా అదనపు రివార్డు పాయింట్లు పొందొచ్చు. సెలెక్టెడ్ మర్చంట్ల వద్ద నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద కొనుగోలు చేయడం వల్ల తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తాయి. కొత్తగా ఈ కార్డులు తీసుకున్న వారికి వెల్కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి తెచ్చాయి.
కనుక ప్రతి ఒక్కరూ రోజువారీగా ఏయే ఖర్చులు ఎక్కువ చేస్తున్నారో గుర్తించిన తర్వాత ఆయా రంగానికి చెందిన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆయా క్రెడిట్ కార్డులు ఇచ్చే ఆఫర్లు, రివార్డు పాయింట్లతో ఫీజు, వడ్డీరేట్లను సరిపోల్చుకున్న తర్వాత మెరుగైన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డు ఎంపిక చేసుకోవడం సరైన చర్య అని చెబుతున్నారు.