న్యూఢిల్లీ, నవంబర్ 25: గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి పూర్తిగా ఆదాయ పన్ను (ఐటీ) మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రియల్టర్ల సంఘం క్రెడాయ్ కోరింది. ఈ ప్రోత్సాహకం మధ్యతరగతి వర్గాల్లో ఇండ్ల కొనుగోళ్లను పెంచగలదని, అది యావత్తు నిర్మాణ రంగాభివృద్ధికి దోహదం చేయగలదని అభిప్రాయపడింది. ప్రస్తుతం గృహ రుణాలపై వార్షిక వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలదాకే ఉంటే ఐటీ చట్టంలోని సెక్షన్ 24 కింద రుణ గ్రహీతలకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తున్నది. అది దాటితే మాత్రం వర్తిస్తున్నది. దీంతో ఈ లిమిట్‌ను తొలగించాలని క్రెడాయ్ అంటున్నది. క్రెడాయ్ ఏర్పాటై 25 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో సోమవారం దాని అధ్యక్షుడు బొమన్ ఇరానీ ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే పైవిధంగా డిమాండ్ చేశారు.
సరసమైన ధర (అఫర్డబుల్)ల్లో లభించే నివాసాల విలువను రూ.45 లక్షల నుంచి రూ.75-80 లక్షలకు పెంచాలని కూడా ఇరానీ డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఈ శ్రేణి గృహాలపై 1 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)నే వేయాలన్నారు. ప్రస్తుతం రూ.45 లక్షలలోపు ఖర్చవుతున్న ఇండ్లపై జీఎస్టీ 1 శాతంగానే ఉన్నది. ఆపై విలువ కలిగిన ఇండ్లకు 5 శాతం జీఎస్టీ పడుతున్నది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా రావట్లేదని డెవలపర్లు అంటున్నారు. దీంతో అఫర్డబుల్ హౌజింగ్ నిర్వచనాన్ని సవరించాలని క్రెడాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
2017లో ఈ నిర్వచనం వచ్చింది. రూ.45 లక్షల వ్యయంతో నిర్మించే ఇండ్లను ఈ కేటగిరీలో చేర్చారు. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు అన్నింటి ధరలు పెరిగాయని, కాబట్టి రూ.75-80 లక్షల ఖర్చుతో నిర్మించే నివాసాలన్నింటినీ అఫర్డబుల్ హౌజింగ్లోకే చేర్చాలని రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల జీఎస్టీ భారం తగ్గుతుందని, ఇండ్ల కొనుగోలుదారులకు లాభిస్తుందని చెప్తున్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘ సమాఖ్య (క్రెడాయ్) 1999లో ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఇందులో 13వేలకుపైగా సభ్యులున్నారు.