సమర్కండ్ (ఉజ్బెకిస్థాన్)/న్యూఢిల్లీ, మే 5: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారత జీడీపీ వృద్ధికి అడ్డుపడుతున్నది. ఇప్పటికే ఈ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్థిక వృద్ధికి సైతం ఇబ్బందులు తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత జీడీపీ అంచనాలకు తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) కోతలు పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) 6.3 శాతానికే పరిమితం కావచ్చని ఏడీబీ వార్షిక సమావేశం సందర్భంగా దాని ప్రధాన ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ మంగళవారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. గత నెలలో 6.9 శాతంగా ఉండొచ్చనగా.. ఇప్పుడు అందులో 0.6 శాతం తగ్గించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) 7.3 శాతం జీడీపీ నమోదు కావచ్చని ఏప్రిల్‌లో ఏడీబీ చెప్పింది. అయితే తాజా అంచనాలతో ఇది కూడా తగ్గిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. దేశీయంగా ఉండే బలమైన డిమాండ్‌ను పెరుగుతున్న ద్రవ్యోల్బణం దెబ్బతీస్తుండటమే.. వృద్ధి అంచనాల తగ్గుదలకు కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వార్ ఎఫెక్ట్ ఇలా..
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలైంది. అంతకుముందు బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 70 డాలర్లే. కానీ ఇప్పుడు 40 డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుతం 110 డాలర్ల వద్ద కదలాడుతున్నది. అమెరికా క్రూడ్ బెంచ్‌మార్క్ సైతం బ్యారెల్ 100 డాలర్లకుపైగా సూచిస్తున్నది. దీంతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కొనసాగితే.. ముడి చమురు రేట్లు మరింతగా విజృంభించడం ఖాయమే. ఇక పెరుగుతున్న ముడి చమురు ధరలు.. అనుబంధ రంగాలనూ దెబ్బతీస్తున్నాయి. యుద్ధం మొదలై 2 నెలలు దాటిపోవడంతో ఇప్పటికే రిటైల్ మార్కెట్లో ఆయా ఉత్పత్తుల ధరల్ని కంపెనీలు పెంచేశాయి. వివిధ రకాల సబ్బులు, రంగులు, ఎరువుల రేట్లు ప్రత్యక్షంగా.. మిగతా వాటి ధరలు పరోక్షంగా పెరుగడంతో వినియోగదారులపై ఆ భారం పడుతున్నది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర గల్ఫ్ దేశాలదే. రష్యా నుంచి కూడా పెద్ద ఎత్తునే కొంటుండగా.. అమెరికా ఆంక్షలు అందుకు అడ్డుతగులుతున్నాయి.
ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే ముడి చమురుకు బ్రేకులు వేసింది. అమెరికాకు అండగా నిలుస్తున్నాయని పొరుగు దేశాలపై ఇరాన్ గురి పెడుతున్నది. యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో అమెరికా చర్చలు కొంత ఊరటనిచ్చినా.. ఆయా అంశాల్లో ఇరు దేశాల పట్టుదల పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం నివారణకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నది. ఇది చమురు దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌ను కలవరపెడుతున్నదిప్పుడు. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే.. దేశీయంగా దిగుమతి బిల్లు 17-18 బిలియన్ డాలర్లు పెరుగుతుంది మరి. అలాగే కరెంట్ ఖతా లోటు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, తయారీ మందగమనం, నిరుద్యోగ సమస్యల వల్ల అంతిమంగా దేశ ఆర్థిక వృద్ధిరేటే బలవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
సంక్షోభం ముదిరితే అంతే..: సీఐఐ
పశ్చిమాసియాలో సంక్షోభం సుదీర్ఘకాలం సాగితే సరుకు రవాణాపై భారీగా ప్రభావం పడుతుందని, ఇంధన ధరలు పెరుగుతాయని, ఇది భారత్‌కు ఆర్థికపరంగా చాలా ప్రమాదకరమని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మేమాని విశ్లేషించారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం దిగువకే పరిమితం కావచ్చన్న అంచనాను పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెలిబుచ్చారు. కాగా, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలని, న్యాయపరమైన సంస్కరణలను తేవాలని సూచించారు. ఆర్బీఐ ద్రవ్య విధానంపై మాట్లాడుతూ.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు రుణ లభ్యత మరింతగా పెరుగాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌లో ద్రవ్యోల్బణం 6.9 శాతంగా నమోదు కావచ్చు. దేశ జీడీపీ 0.6 శాతం తగ్గిపోయే వీలున్నది. భారతీయ ఇంధన అవసరాలు దిగుమతుల ద్వారానే ఎక్కువగా తీరుతున్న నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం ప్రభావితం చేస్తున్నది మరి. సరఫరా తగ్గితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎగబాకడం ఖాయం. ముఖ్యంగా పెరిగే ఎరువుల ధరలు.. రైతుల వినియోగ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. పంట సాగు, దిగుబడులు కూడా పడిపోవచ్చు. ఇదే జరిగితే ఆహార ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. తుదకు అన్ని రంగాలు ప్రభావితమై వృద్ధిరేటు పతనమే.
-ఆల్బర్ట్ పార్క్, ఏడీబీ ప్రధాన ఆర్థికవేత్త