PM Modi : పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ జల్మురి తిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానికి ఆ జల్మురి ఇచ్చిన వ్యాపారిని చంపేస్తామంటూ ఇప్పుడు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ వ్యాపారి పేరు విక్రమ్ సాహు. ప్రధాని గత నెల 19న ఎన్నికల ప్రచారం కోసం పశ్చిమ బెంగాల్ వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా, ఝర్గ్రామ్ వద్ద కాన్వాయ్ ఆపి, బెంగాల్లోని ప్రముఖ ఆహార పదార్థమైన జల్మురిని తినేందుకు అక్కడి ఒక చిరు వ్యాపారి దగ్గరకు వెళ్లారు.
అతడితో కొద్దిసేపు మాట్లాడి జల్మురి కొనుక్కుని తిన్నారు. ఈ అంశం అప్పట్లో బాగా పాపులర్ అయింది. ప్రధాని ఒక సామాన్యుడిలా జల్మురి తినడంతో బీజేపీకి బెంగాల్లో కొంత సానుకూలత తీసుకొచ్చింది. దీనిపై అప్పటి అధికార టీఎంసీ విమర్శలు చేసింది. ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా అని టీఎంసీ ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం చేశారని విమర్శించింది. తాను జల్మురి తింటేనే భయపడుతున్నారంటూ మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత పలు ర్యాలీల్లోనూ, చివరికి విదేశాల్లోనూ మోదీ జల్మురి అంశాన్ని ప్రస్తావించారు. మొత్తానికి మోదీ జల్మురి తినడం రాజకీయ అంశంగా మారిపోయింది. మోదీకి జల్మురి అమ్మిన వ్యక్తి కూడా ఫేమస్ అయిపోయాడు.
ఇప్పడు ఎన్నికల రిజల్ట్ వచ్చింది. బీజేపీ అధికార చేపట్టింది. టీఎంసీ ఓడిపోయింది. కానీ, జల్మురి అమ్మిన విక్రమ్ సాహు మాత్రం బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. అతడిని బాంబులతో చంపేస్తామంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో అతడితోపాటు అతడి కుటుంబం కూడా భయాందోళనకు గురవుతోంది. ఈ బెదిరింపులపై విక్రమ్ సాహూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు కొద్ది రోజుల నుంచి వరుసగా పాక్, బంగ్లాల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని విక్రమ్ సాహు చెప్పాడు. ఈ అంశంపై ఇటు బీజేపీ, అటు పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.