బీజింగ్: ట్రంప్ నేతృత్వంలోని అమెరికా బృందం కొన్ని రోజుల క్రితం చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా రాజకీయ, వ్యాపారవేత్తలకు బీజింగ్‌లో భారీ విందు ఏర్పాటు చేశారు. ఆ విందు కార్యక్రమంలో ఓ అమ్మాయి ఎరుపు రంగు దుస్తుల్లో వెయిట్రెస్‌గా కనిపించారు. ఆమె కాసేపు మస్క్(Elon Musk) వద్ద అటూ ఇటూ తిరిగింది. ఆ తర్వాత ఓ దశలో ఫోటో కూడా దిగింది. అయితే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చైనాకు చెందిన ఇండిపెండెంట్ బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఓ సంచలన విషయాన్ని చెప్పారు. అమెరికా బృందంపై చైనా నిఘా పెట్టినట్లు జెంగ్ ఆరోపించారు.
సర్వర్‌గా ఎలన్ మస్క్ సమీపంలో నిలబడ్డ ఆ అమ్మాయి వెయిట్రెస్ కాదు అని, ఆమె చైనా మిలిటరీకి చెందిన లేడీ జనరల్ అని జెంగ్ తన బ్లాగ్‌లో ఆరోపించారు. తన సోషల్ మీడియాలో జెంగ్ ఆ వెయిట్రెస్ గురించి పోస్టులు పెట్టారు. మేజర్ చెంగ్ చెంగ్ అనే మహిళ మస్క్ వద్ద నిలుచుకున్నట్లు ఆ బ్లాగ్‌లో పేర్కొన్నారు. చైనా మిలిటరీ కార్యక్రమాలకు చెందిన ఆపరేషనల్ మాన్యువల్స్ ఆమె రాస్తారట. ఆ దేశ ఎలైట్ బెటాలియన్ కమాండర్ ఆమె అని తెలిపారు. మస్క్ వద్ద నిలబడ్డ ఆ వెయిట్రెస్ వేసుకున్న ఎరుపు రంగు దస్తుల వెనుక గన్ ఉండి ఉంటుందేమో అని ఆమె పేర్కొన్నారు.
బ్లాగర్ జెంగ్ గతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ గురించి సంచలన ఆరోపణ చేశారు. ఆ హత్య చైనా చేసిందని, కానీ దాంట్లో ఇండియాను ఇరికించినట్లు ఆమె ఆరోపించారు.