హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని వ్యాపార, వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఫ్రాన్స్, దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి ఏరోస్పేస్, డిఫెన్స్‌తోపాటు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగాలపై అక్కడి కంపెనీలు దృష్టి పెట్టనున్నాయి. ఈ క్రమంలో నే ఇరు దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలో పర్యటించనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించి దేశ, విదేశీ అగ్రగామి కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్తోపాటు టాటా-బోయింగ్, జీఎమ్మార్ తదితర సంస్థలున్నాయి. విమానాల విడిభాగాలు, ఇంజిన్లు, హెలీకాప్టర్ బాడీ తయారీ విస్తృతంగా జరుగుతున్నది. ఇక జీఎమ్మార్ ఆధ్వర్యంలో విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఒవర్‌హాల్(ఎంఆర్ఓ)ను నిర్వహిస్తున్నారు. మరోవైపు బోయింగ్-జీఎమ్మార్ సంయుక్తంగా ప్యాసింజర్ విమానాలను కార్గో విమానాలుగా మార్చేందుకు ఉద్దేశించిన కన్వర్షన్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో ఇదే మొదటిది కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, బొలీవియాకు చెందిన 70 మంది పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఫ్రాన్స్ రాయబారి ఆధ్వర్యంలో ఈ నెల 10న రాష్ర్టానికి ఆ దేశ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులు రానున్నారు. అయితే అంతకన్నా ముందే రాష్ట్రంలో బ్యాటరీల తయారీకున్న అవకాశాలను పరిశీలించేందుకు బొలీవియా దేశ ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు ఈ నెల 5న రానున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అమరరాజాతోపాటు పలు కంపెనీలు ఈవీలు, బ్యాటరీల తయారీకి దిగిన సంగతి విదితమే. దీంతో బొలీవియాకు చెందిన ఓ ప్రముఖ లిథియం బ్యాటరీల తయారీ కంపెనీ సైతం ఇక్కడి మార్కెట్‌పై దృష్టి పెట్టినట్టు సమాచారం. కాగా, ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తోనూ చర్చలు జరుపుతారని చెప్తున్నారు.