న్యూఢిల్లీ, జూలై 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ భారీ స్థాయిలో జీఎస్టీని ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తున్నది. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి ముందస్తు షో-కాజ్ నోటీసు జారీ అయినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. జూలై 2017 నుంచి మార్చి 2022 వరకు రూ.32 వేల కోట్ల జీఎస్టీ చెల్లింపులు జరుపలేదని కర్ణాటక స్టేట్ జీఎస్టీ ఆథార్టీ ఈ నోటీసును జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
కంపెనీకి సంబంధించి విదేశీ కార్యాలయాలు పెట్టే ఖర్చులపై జీఎస్టీ చెల్లించలేకపోవడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిటెన్స్ ఈ ముందస్తు షోకాజ్ నోటీసును జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసుపై సంస్థ వివరణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. నిబంధనల ప్రకారం అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని కంపెనీ విశ్వసిస్తున్నది. ఇటీవల ప్రత్యక్ష పన్నుల బోర్డు జారీ చేసిన నిబంధనల ప్రకారం దేశీయ సంస్థలు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీ పరిధిలోకి రావని ఇన్ఫోసిస్ తెలిపింది.