న్యూఢిల్లీ, మార్చి 12: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్.. హైదరాబాద్‌కు చెందిన ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను హస్తగతం చేసుకోబోతున్నది. రూ.820 కోట్లతో 53 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ..మరో 26 శాతం అదనపు వాటాను ఒపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయడానికి సిద్ధమైంది.
ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. 53.13 శాతం వాటాకు సమానమైన 10,68,96,146 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి కంపెనీ బోర్డు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి కోరమాండల్ ఇంటర్నేషనల్, ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కే లక్ష్మి రాజు(ప్రమోటర్), బ్రైట్ టౌన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ ప్రైవేట్ లిమిటెడ్‌లు వాటా కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కొనుగోలు ఒప్పందం వచ్చే కొన్ని నెలల్లో ముగియనున్నదని కోరమాండల్ వర్గాలు వెల్లడించాయి.