Credit Card- Personal Loan | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డు ఉంది. ఆన్ లైన్ పేమెంట్స్, ఈ-కామర్స్ – వ్యాపార లావాదేవీలకు క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డు వాడాల్సి రావచ్చు. అప్పటికప్పుడు చేతిలో డబ్బుల్లేకపోయినా ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు వెసులుబాటు కలిగిస్తాయి. ఈ సౌకర్యం వల్ల కొన్నిసార్లు ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది కూడా. ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే గడువు లోపు బిల్లు పే చేయలేని దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం..!
సకాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి వ్యూహాలు ఉంటాయి. వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తం ఈఎంఐ చెల్లింపుల్లోకి మార్చుకోవచ్చు. మరో క్రెడిట్ కార్డుకు ఆ బాకీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. అంతే కాదు.. క్రెడిట్ కార్డు బిల్లును పర్సనల్ లోన్‌గా మార్చుకునే అంశాన్ని పరిశీలించొచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును ఏకీక్రుతం చేసి, పర్సనల్ లోన్ గా మార్చినప్పుడు ఆర్థికంగా చిక్కులు తప్పుతాయి. ఈ లోన్ తేలిగ్గా వాయిదాల్లో చెల్లించడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా వడ్డీ, ఇతర ఫీజులు తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది.
క్రెడిట్ కార్డు బిల్లులతో పోలిస్తే వ్యక్తిగత రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తాయి బ్యాంకులు. దీనివల్ల వడ్డీపై డబ్బు ఆదా కావడంతోపాటు సదరు రుణం వేగంగా చెల్లించడానికి వీలు కలుగుతుంది. క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం చెల్లిస్తూ.. తర్వాత మొత్తం బిల్లు చెల్లించడం అంటే కాసింత కష్టంతో కూడుకున్న పనే. క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతూ ఉంటది. దీనికి బదులు రుణంతో ఒకేసారి బాకీ చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగు పడే చాన్స్ ఉంటది.
క్రెడిట్ కార్డు బిల్లు గడువు లోపు చెల్లించకుంటే `వడ్డించే` ఫీజులు అధికంగా ఉంటాయి. రుణం తీసుకుని చెల్లిస్తే వీటి బాధ ఉండదు. రుణం తీసుకోవడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించడానికి వీలుగా పర్సనల్ లోన్ తీసుకునే అర్హత ఉందా.. లేదా.. అన్న విషయాన్ని మీరు బ్యాంకుకు వెళ్లి అధికారుల వద్ద సంప్రదిస్తే, క్రెడిట్ స్కోర్, మీ ఆదాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రుణ అర్హత నిర్ణయిస్తారు.
కొన్ని బ్యాంకులు 12 నెలల నుంచి గరిష్టంగా 84 నెలల గడువు వరకూ పర్సనల్ లోన్ మంజూరు చేస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో లోన్ సులభంగా చెల్లించేలా ఈఎంఐలు నిర్ణయించుకోవాలి. పర్సనల్ లోన్ మంజూరు కాగానే ముందుగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేయాలి. లేకపోతే మీపై అప్పు భారం పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.