హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ.. కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను నియంత్రించేందుకు మంచిర్యాల మండలం జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో రూ.700 కోట్లతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్జీడీ) ప్లాంట్ను నిర్మిస్తున్నది. ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్న ఈ పనులు ఇప్పటికే దాదాపు పూర్తి కావొచ్చాయి. డిసెంబర్లో ఎఫ్జీడీ ప్లాంట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సింగరేణి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎస్టీపీపీలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లు ఉన్నాయి. వాటిలో విద్యుత్తు ఉత్పత్తి కోసం రోజూ దాదాపు 17 వేల టన్నుల బొగ్గును మండిస్తుండటంతో సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి హానికర వాయువులు వెలువడుతున్నాయి. వీటి వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉండటంతో ఎఫ్జీడీని ఏర్పాటు చేస్తున్నారు.
ఒడిశాలోని నైని బొగ్గు గనిలో ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సిద్దమవుతున్నది. వచ్చే సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్న ఈ బొగ్గు గనిలో ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్నది. ఈ గనిలో 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.