కొత్త ఏడాది మొదలైంది. చాలామంది మదుపరులు ఇప్పటికే తమ పెట్టుబడులపై సమీక్ష, నూతన పెట్టుబడులకు మార్గాల అన్వేషణ చేస్తూనే ఉంటారు. అయితే మీరు సంప్రదాయ మదుపరై, మీ దీర్ఘకాల లక్ష్యాల సాధన కోసం ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో మీకు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) అత్యుత్తమమని నిపుణులు చెప్తున్నారు. లార్జ్ క్యాప్ ఎంఎఫ్‌లు.. మార్కెట్ విలువలో టాప్-100 కంపెనీల్లో తప్పక పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం భారీ సంస్థలు ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణిస్తున్నాయని, అందుకే మదుపరులు తమ పెట్టుబడులకు లార్జ్ క్యాప్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని అంటున్నారు.
నిజానికి ఈక్విటీ ఇన్వెస్టర్లలో చాలామంది మార్కెట్లో పెరుగుతున్న ఒడిదుడుకులు, అనిశ్చితిపై ఆందోళనగా ఉన్నారు. అయితే వీరు లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులను పరిశీలించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఒడిదుడుకులను తట్టుకుని మరి ఇవి దీర్ఘకాలంలో లాభాలను పంచి పెడుతాయని వివరిస్తున్నారు.