ముంబై, సెప్టెంబర్ 12: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్‌ను సరెండర్ చేయాలనుకున్న టాటా సన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ చేసిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తిరస్కరించింది. ఈ మేరకు టాటా సన్స్ కంపెనీ కార్యదర్శి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు ఓ లేఖ ద్వారా సమాచారం అందింది. దీంతో ఇక నిబంధనల ప్రకారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా సన్స్ నమోదుకాక తప్పని పరిస్థితి నెలకొన్నదని సంబంధిత వర్గాలు శనివారం అభిప్రాయపడ్డాయి.
అయితే దీనిపై అటు ఆర్బీఐగానీ, ఇటు టాటా సన్స్ వర్గాలుగానీ స్పందించేందుకు నిరాకరించాయి. కాగా, 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్‌ను ఉన్నత శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ వర్గీకరించింది. ఫలితంగా మూడేండ్లలో (2025 సెప్టెంబర్‌కల్లా) స్టాక్ మార్కెట్లలో నమోదు కావాల్సి ఉన్నది. అయితే దీనికి విముఖంగా ఉన్న టాటా సన్స్.. 2024లో రూ.21,000 కోట్లకుపైగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించేసింది. ఈ క్రమంలోనే అదే ఏడాది మార్చిలో తమ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోదలిచామని, కాబట్టి ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌ను తిరిగి అప్పగిస్తామంటూ ఆర్బీఐకి ఓ దరఖాస్తు ద్వారా విజ్ఞప్తి చేసింది.
ఈ అభ్యర్థనను పెండింగ్‌లో పెట్టిన ఆర్బీఐ.. టాటా సన్స్‌ను దేశంలోని ప్రధాన ఎన్బీఎఫ్సీలలో ఒకటిగానే కొనసాగించింది. ఇప్పుడు సదరు విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇక టాటా సన్స్ ఆస్తులు రూ.2 లక్షల కోట్లకుపైగానే ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన ఇటీవలి నిబంధనల ప్రకారం లక్ష కోట్లు దాటితే ప్రధాన ఎన్బీఎఫ్సీగానే ఆ సంస్థ ఉంటుంది. దీంతో ఇలాంటి ఓ ఎన్బీఎఫ్సీ లైసెన్స్ రద్దు కష్టతరమేనన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
టాటా సన్స్‌కు టాటా గ్రూప్‌లోని ఎన్నో సంస్థల్లో వాటాలున్న విషయం తెలిసిందే. అలాంటి టాటా సన్స్ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తే.. ఆర్థిక, పెట్టుబడులు, మూలధనం, వాటాల విలువ ఇలాంటి అన్నింటి వివరాలను తప్పక బహీర్గతం చేయాల్సి ఉంటుంది. ప్రతి నిర్ణయానికి రెగ్యులేటర్లు, షేర్ హోల్డర్ల అనుమతి అవసరం ఉంటుంది. పైగా డైరెక్టర్ల మధ్య తలెత్తిన విభేదాలకూ దూరంగా ఉండాలనే ఎన్బీఎఫ్సీ లైసెన్స్ రద్దుకు టాటా సన్స్ గట్టిగా ప్రయత్నించింది.
టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా సైతం పబ్లిక్ లిస్టింగ్‌తో టాటా సన్స్ దీర్ఘకాలిక నిర్మాణం, దాతృత్వ సంబంధిత కార్యకలాపాలు రిస్క్‌లో పడుతాయని ఆర్బీఐకి తెలిపినట్టు చెప్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కాగా, ప్రస్తుతం దేశంలో టాటా సన్స్ సహా 17 ప్రథమ శ్రేణి ఎన్బీఎఫ్సీలున్నాయి. వీటిలో ఒక్క టాటా సన్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లలో నమోదు కాలేదు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో త్వరలోనే టాటా సన్స్ మార్కెట్ ఎంట్రీ ఉండవచ్చన్న అంచనాలున్నాయి.